టీఎంసీకి ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష హోదా వివాదంలో ట్విస్ట్! | Ritabrata Banerjee to stay on as LoP for now | Sakshi
Sakshi News home page

టీఎంసీకి ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష హోదా వివాదంలో ట్విస్ట్!

Jun 18 2026 11:47 AM | Updated on Jun 18 2026 1:48 PM

Ritabrata Banerjee to stay on as LoP for now

పశ్చిమ బెంగాల్ పొలిటికల్‌ ట్విస్టుల పర్వం కొనసాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీకి ఇంకో ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని ప్రస్తుతానికి ప్రతిపక్ష నేతగా కొనసాగేందుకు గురువారం కలకత్తా హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రమంలో స్పీకర్ నిర్ణయంపై తాత్కాలిక స్టే ఇవ్వాలన్న టీఎంసీ విజ్ఞప్తికి నిరాకరించింది. 

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. టీఎంసీ చీలిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నాయకత్వంపై అసంతృప్తితో 59 మంది ఎమ్మెల్యేలు(మొత్తం 80 మంది గెలిచారు) రెబల్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న రితబ్రత బెనర్జీ.. తనను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆశ్రయించారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో స్పీకర్‌ కూడా దానిని ఆమోదించారు. 

అయితే.. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దీదీ టీఎంసీ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. ఇవాళ వాదనల సందర్భంగా.. పార్టీ సస్పెండ్‌ చేసిన ఓ వ్యక్తిని ప్రతిపక్ష నేతగా ఎలా నిర్ణయిస్తారని? ప్రశ్నించింది. అసెంబ్లీ లోపల ప్రతిపక్ష నేత (Leader of Opposition)గా గుర్తించిన స్పీకర్  రతిన్ బసు నిర్ణయం సరికాదని.. ఆయన ఎలాంటి విచారణ జరపకుండానే ఆ పని చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఒక పార్టీ తీసుకున్న నిర్ణయం కాకుండా.. సంఖ్యా బలం ఆధారంగా ప్రతిపక్ష నేతను నిర్ణయించడం రాజ్యాంగానికి విరుద్దమని వాదించింది.

టీఎంసీ ప్రతిపాదన పెండింగ్‌లో ఉండగా.. మరో వ్యక్తిని.. అందునా సస్పెండ్‌ అయిన వ్యక్తిని ఎలా నిర్ణయించారని స్పీకర్‌ను జస్టిస్‌ కృష్ణారావు వివరణ కోరారు. అయితే.. స్పష్టమైన సంఖ్యా బలం ఉండడంతో స్పీకర్‌ ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అసెంబ్లీ కార్యదర్శి వివరణ ఇచ్చారు. అయితే.. ఆ సమయంలో టీఎంసీ తరఫున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. 

ఈ అం‍శంలో మరింత విచారణ అవసరమని తదుపరి విచారణను జస్టిస్‌ కృష్ణారావు జులై 28కి వాయిదా వేశారు. స్టే విధించాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను తోసిపుచ్చారు. అలాగే తదుపరి విచారణ లోపు అన్ని పక్షాలు తమ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం ప్రస్తుతానికి అమల్లోనే కొనసాగనుంది.

ఇదిలా ఉండగా.. మమతా బెనర్జీతో సహా టీఎంసీకి చెందిన కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడారు. దీంతో సీనియర్ నేత శోభనదేవ్ చటర్జీని లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఆమె వర్గం ప్రతిపాదించింది. ఈలోపు టీఎంసీలో ముసలం మొదలైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో జూన్‌ 1వ తేదీన రితబ్రత బెనర్జీని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. అయితే.. 58 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో ఆయనకే ప్రతిపక్ష నేత గుర్తింపు దక్కింది. మొత్తం మీద, హైకోర్టు తాజా నిర్ణయంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త ఉత్కంఠ నెలకొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement