భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో అరుదైన ‘షేక్‌హ్యాండ్‌’ | Rare Handshake At LoC Between Officers As Pak National Returns Home | Sakshi
Sakshi News home page

భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో అరుదైన ‘షేక్‌హ్యాండ్‌’

Jun 19 2026 7:43 PM | Updated on Jun 19 2026 8:15 PM

Rare Handshake At LoC Between Officers As Pak National Returns Home

శ్రీనగర్: ‘ఆపరేషన్‌ సిందూర్’ అనంతరం.. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో.. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LoC) వద్ద అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. భారత సైన్యం అదుపులో ఉన్న పాకిస్థాన్ పౌరుడు అసద్ ఖాన్‌ను స్వదేశానికి అప్పగించే సందర్భంగా ఇరు దేశాల సైన్యాధికారులు పరస్పరం కరచాలనం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. మానవతా విలువలకు కట్టుబడి ఉన్న భారత సైన్యం.. అసద్ ఖాన్‌ను గౌరవంగా చూసుకుంది. అనంతరం పాకిస్థాన్ సైన్యానికి అప్పగించింది. దీంతో పాక్‌ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా తీత్వాల్ సెక్టార్ పరిధిలోని సిమారి ప్రాంతంలో గత వారం నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన అసద్ ఖాన్‌ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆయన పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా (కేపీకే) ప్రాంతానికి చెందినవాడని సైన్యం వెల్లడించింది. అయితే, అతడిని విడుదల చేయాలని పాకిస్థాన్‌లోని పలువురు నెటిజన్లు భారత సైన్యాన్ని కోరారు.

కొంతకాలం పాటు నిర్బంధంలో ఉంచిన అధికారులు.. అసద్‌ ప్రవర్తనపై ఎటువంటి అనుమానం రాకపోవడంతో తిరిగి స్వదేశానికి పంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో అసద్ ఖాన్‌ను సరిహద్దు క్రాసింగ్ పాయింట్ దగ్గర పాకిస్థాన్‌ సైన్యానికి అధికారికంగా అప్పగించారు. ఈ సందర్భంగా తీసిన చిత్రాలను భారత సైన్యం తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో విడుదల చేసింది. వాటిలో భారత సైన్యానికి చెందిన మేజర్ హోదా అధికారి, పాకిస్థాన్ సైన్యాధికారితో కరచాలనం చేస్తున్న దృశ్యం కనిపించింది.

ఈ సందర్భంగా భారత సైన్యం విడుదల చేసిన ప్రకటనలో, “ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా నివాసి అసద్ ఖాన్ జూన్ 12న నియంత్రణ రేఖ దాటి సిమారి గ్రామం వద్ద పట్టుబడ్డాడు. జూన్ 18న అతడిని పాకిస్థాన్‌కు తిరిగి పంపించాం. భారత్‌లో ఉన్నంత కాలం అతడిని గౌరవంగా.. మానవతా దృక్పథంతో చూసుకున్నాం. సైన్యం నైతిక విలువలకు నిదర్శనం” అని పేర్కొంది. 

 


 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement