
ఓటర్ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిందని, ఎన్నికల సంఘం రాజ్యాంగానికి గనుక కట్టుబడి ఉంటే తాము కోరిన వివరాలను అందించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం బెంగళూరులో ఓట్ అధికార్ ర్యాలీ పేరిట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
భారత రాజ్యాంగం విశిష్టమైనది. మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేద్కర్, బసవన్న, పూలే, నారాయణ గురు ఆలోచనలు మన రాజ్యాంగంలో ప్రతిబింబిస్తున్నాయి. అలాంటి రాజ్యాంగాన్ని 2024 లోక్‌సభ ఎన్నికల నుంచి మేం మన రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక వ్యక్తి.. ఒక ఓటు అనేది రాజ్యాంగం ప్రతీ పౌరుడికి కల్పించిన హక్కు. అలాంటిది బీజేపీ, మోదీ ఆ హక్కు ఇచ్చిన రాజ్యాంగంపై దాడి మొదలుపెట్టారు. ఓటర్ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచింది అని రాహుల్ అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో మా సర్వే ప్రకారం.. 15 నుంచి 16 సీట్లు గెలుస్తుందని అంచనా వేశాం. కానీ, 9 మాత్రమే గెలిచాం. ఆ ఫలితాలను విశ్లేషించినప్పుడు.. నిజంగానే మేం ఓడిపోయామా? అనిపించింది. వెంటనే ఓటర్ల సాఫ్ట్ కాపీని ఇవ్వమని ఈసీని కోరాం. కానీ, ఈసీ అందుకు నిరాకరించింది. ఎన్నికల వీడియోలు కావాలని కోరినా.. రూల్స్ మారిపోయాయంటూ ఇవ్వడానికి ఒప్పుకోలేదు.
లోక్‌సభ ఎన్నికల తరవాత మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. అక్కడ మా మహఘట్బంధన్ లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. నాలుగు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. మహారాష్ట్రలో కోటి మంది కొత్త ఓటర్లు నమోదు అయ్యారని గుర్తించాం. వీళ్లెవరూ లోక్‌సభ ఎన్నికలకు ఓటేయలేదు. ఇండియా కూటమికి ఓటు షేర్ ఎక్కడా తగ్గలేదు. కానీ, కొత్తగా చేరిన ఓటర్లు బీజేపీకి ఓటేశారు. అలా బీజేపీ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో నెగ్గింది. అక్కడే ఏదో తప్పు జరిగిందని గుర్తించాం.
नरेंद्र मोदी वोट चोरी करके प्रधानमंत्री बने हैं
चुनाव आयोग हमें डेटा दे, हम साबित कर देंगे pic.twitter.com/WUBm97WR4g— Congress (@INCIndia) August 8, 2025
బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ పార్లమెంట్ ఫలితం.. అందునా మహదేవపుర సెగ్మెంట్ నుంచే మేం మా పరిశోధన మొదలుపెట్టాం. మహదేవపురలో 6.5 లక్షల ఓట్లు ఉంటే.. 1,00,250 ఓట్లు చోరీకి గురయ్యాయి. అంటే.. సగటున ఆరు ఓట్లలో ఒకటి చోరీకి గురైందన్నమాట. అలా లోక్‌సభ ఎన్నికల్లో ఈసీ బీజేపీ కలిసి మోసం చేశాయని నిరూపించగలిగాం.
బెంగళూరులోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,250 ఫేక్ ఓట్లు నమోదయ్యాయని రాహుల్ గాంధీ అంటున్నారు. ఆయన లెక్క ప్రకారం ఫేక్ ఓట్లు ఇలా ఉన్నాయి
• 11,965 డూప్లికేట్ ఓటర్లు
• 40,009 ఫేక్/చెల్లని చిరునామాలు
• 10,452 ఓటర్లు ఒకే చిరునామాలో నమోదు
• 4,132 చెల్లని ఫోటోలు
• 33,692 మంది Form 6 ద్వారా అనుమానాస్పదంగా ఓటర్లుగా నమోదు
మహారాష్ట్రలో కోటి మంది కొత్త ఓటర్లుగా నమోదు అయ్యారు. కర్ణాటకలోనూ ఫేక్ ఓట్లు నమోదయ్యాయి. ఒకే ఇంటిపై 40కిపైగా ఓట్లు నమోదు అయ్యాయి. మేం ప్రశ్నిస్తుంటే ఈసీ వెబ్‌సైట్ మూసేసింది. ఎన్నికల సంఘం బీజేపీతో కలిసి ఎన్నికల మోసానికి పాల్పడింది. ఓట్ల దొంగతనం తీవ్రమైన నేరం. ఆ నేరం జరిగింది అనడానికి కర్ణాటక డేటానే ఆధారం. ఎన్నికల వీడియోలు, డిజిటల్ ఓటర్ లిస్టులు ఇవ్వకుండా ఈసీ నేరాన్ని దాచిపెడుతోంది. ఈ ఓట్ల దొంగతనంను దేశవ్యాప్తంగా బయటపెట్టేందుకు కాంగ్రెస్ ఉద్యమం ప్రారంభించబోతోంది.
నన్ను అఫిడవిట్ ఇవ్వమని, ప్రమాణం చేయమని ఈసీ అడుగుతోంది. కానీ నేను పార్లమెంట్‌లో రాజ్యాంగం మీద ఇప్పటికే ప్రమాణం చేశాను. ఎన్నికల సంఘం బీజేపీకి గనుక పని చేయకపోతే.. రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. ఎన్నికల వీడియోలు, డిజిటల్ ఓటర్ లిస్టులు మాకు అందించాలి’’ అని రాహుల్‌గాంధీ ఈసీకి సవాల్ విసిరారు.