ఆ దేశ గోల్డెన్ జూబిలీ వేడుకలకు హాజరు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27–29వ తేదీల్లో సెషెల్స్‌లో పర్యటించనున్నారు. ఆ దేశ 50 ఏళ్ల జాతీయ దినోత్సవాల్లో ఆయన గౌరవ అతిథిగా పాల్గొంటారు. పర్యటనలో భాగంగా అధ్యక్షుడు పాట్రిక్ హెర్మీనీతో చర్చలు జరుపుతారు. 50 ఏళ్లలో ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతిని సమీక్షిస్తారని గురువారం విదేశాంగ శాఖ తెలిపింది.
సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను చర్చిస్తారని వివరించింది. అక్కడి భారత సంతతి ప్రజలతో ప్రధాని మోదీ ముచ్చటిస్తారంది. భారత నేవీలోని రెండు నౌకలు, భారత సైనికులు సెషెల్స్ జాతీయ దినోత్సవాల్లో పాలుపంచుకుంటారు. సెషెల్స్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ పర్యటన చేపడుతున్నారని విదేశాంగ శాఖ వివరించింది. చివరిసారిగా మోదీ ఆ దేశాన్ని 2015లో సందర్శించారు.


