పీఎం–వీబీఆర్‌వై కింద 70 లక్షల ఉద్యోగాలు  | PM Modi Says 70 Lakh Jobs Created Under PM-VBRY So Far | Sakshi
Sakshi News home page

పీఎం–వీబీఆర్‌వై కింద 70 లక్షల ఉద్యోగాలు 

Jun 20 2026 5:25 AM | Updated on Jun 20 2026 5:25 AM

PM Modi Says 70 Lakh Jobs Created Under PM-VBRY So Far

ప్రభుత్వం, యువత, పరిశ్రమలు కలిసి పని చేయాలి  

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు  

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన(పీఎం–వీబీఆర్‌వై) కింద దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 70 లక్షలకుపైగా ఉద్యోగాలను సృష్టించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన శుక్రవారం 15 లక్షల మంది ఉద్యోగులు, యాజమాన్యాలకు రూ.2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను బదిలీ చేశారు. ప్రభుత్వం, యువత, పరిశ్రమలు కలిసి పనిచేస్తే ఉద్యోగాల కల్పన అనేక రెట్లు పెరుగుతుందని ఈ సందర్భంగా చెప్పారు. 

పీఎం–వీబీఆర్‌వై పథకం కింద లబి్ధదారులకు సామాజిక భద్రత లభించిందని అన్నారు. కొత్త ఉద్యోగాలను సృష్టించే సంస్థలను లేదా యజమానులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ పథకం తొలిసారి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు, పరిశ్రమలకు మధ్య వారధిగా నిలుస్తుందని వెల్లడించారు. దేశమంతటా ఉపాధి కల్పనకు మద్దతు ఇస్తున్నామని, యువతకు సాధికారత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 

భవిష్యత్తు కోసం మరింత బలమైన శ్రామిక శక్తిని నిర్మిస్తున్నామని ఉద్ఘాటించారు. మన యువత ఆకాంక్షలు, నైపుణ్యాలు, సామర్థ్యాలే ‘వికసిత్‌ భారత్‌’కు బాటలు వేస్తాయని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ప్రపంచ వృద్ధి, ఆవిష్కరణలను ముందుకు నడిపించడంలో భారత యువతదే కీలక పాత్ర అని అన్నారు. 21వ శతాబ్దంలో నైపుణ్యం, ఆవిష్కరణలను ప్రోత్సహించి, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను నెలకొల్పే దేశాలకే అవకాశాలు దక్కుతాయని ప్రధానమంత్రి స్పష్టంచేశారు.

 ఈ మూడు రంగాల్లో భారతదేశానికి తిరుగులేదన్నారు. పీఎం–వీబీఆర్‌వై పథకానికి ప్రభుత్వం రూ.99,446 కోట్లు కేటాయించింది. రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద తొలిసారిగా ఉద్యోగంలో చేరే ఉద్యోగులకు రూ.15,000 వరకు అందిస్తారు. ప్రతి కొత్త ఉద్యోగికి గాను యాజమాన్యానికి నెలకు రూ.3,000 వరకు అందజేస్తారు. కొత్త ఉద్యోగాలను సృష్టించేలా యాజమాన్యాలను ప్రోత్సహించాలన్నదే ఈ పథకం ఉద్దేశం.   
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement