పాక్‌ సిబ్బందితో భారత్‌కు నౌక | Pakistani crew on oil tanker denied disembarkation permission at Odisha | Sakshi
Sakshi News home page

పాక్‌ సిబ్బందితో భారత్‌కు నౌక

May 15 2025 6:07 AM | Updated on May 15 2025 6:07 AM

Pakistani crew on oil tanker denied disembarkation permission at Odisha

ఒడిశా ఓడరేవులో కలకలం

పారాదీప్‌: సింగపూర్‌ మీదుగా దక్షిణకొరియా నుంచి భారత్‌కు వచ్చిన చమురు రవాణా నౌకలో మొత్తం సిబ్బందిలో 21 మంది పాక్‌ జాతీయులు ఉన్నట్లు తేలడంతో ఒడిశాలోని పారాదీప్‌ ఓడరేవులో ఒక్కసారిగా కలకలం రేగింది. పరస్పర సైనిక చర్యలతో భారత్, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాక్‌ వ్యతిరేక వర్గాలు నౌకాశ్రయానికి చేరుకుని ఆందోళన చేపట్టకుండా ఉండేందుకు పోర్ట్‌ అధికారులు వెంటనే అలర్ట్‌ ప్రకటించారు. 

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ కోసం విదేశాల నుంచి తీసుకొచ్చిన ముడి చమురును నౌక నుంచి కిందకు దింపే వరకు నౌకాశ్రయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు చేపట్టారు. పారాదీప్‌ పట్టణంలో ఒడిశా పోలీసులు వెంటనే భద్రతను పెంచారు. 25 మంది సిబ్బందితో ‘ఎంటీ సైరన్‌  ఐఐ’ పేరున్న సరకు రవాణా నౌక బుధవారం తెల్లవారుజామున పారాదీప్‌ పోర్ట్‌కు రాగానే అధికారులు సిబ్బంది గురించి వాకబుచేశారు. వీరిలో ఒక శ్రీలంకన్, ఒక థాయిలాండ్‌ దేశస్తుడు, ఇద్దరు భారతీయులు, 21 మంది పాకిస్తానీయులు ఉన్నారు. 

ఇమిగ్రేషన్‌శాఖ నుంచి సంబంధిత సమాచారాన్ని ఒడిశా మెరైన్‌ పోలీస్‌కు, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌)కు చేరవేశామని మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ బబితా చెప్పారు. ప్రస్తుతం ఓడ నౌకాశ్రయం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్రజలాల్లో లంగరు వేసి ఉంది. క్రూడ్‌ ఆయిల్‌ అన్‌లోడింగ్‌ అవగానే సిబ్బందితో నౌక వెళ్లిపోతుందని జగత్‌సింగ్‌పూర్‌ ఎస్పీ భవానీశంకర్‌ స్పష్టంచేశారు. అప్పటిదాకా పాకిస్తాన్‌ సిబ్బందిని నౌక నుంచి బయటకు అనుమతించబోమని చెప్పారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement