
న్యూఢిల్లీ: భారత్‌లో అక్రమంగా తలదాచుకుంటున్న విదేశీయులపై ప్రభుత్వం నిఘా మరింతగా పెంచింది. జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన అనంతరం ఈ చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్‌లో నివాసం కొనసాగిస్తున్న వారిపై సంబంధిత అధికారులు ఓ కన్నేసి ఉంచారు. వీరి చర్యలను గమనిస్తూ, నిందితులుగా తేలినవారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు.
మరోవైపు బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో పలువులు బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్‌కు తరలివచ్చి, ఇక్కడ తలదాచుకుంటున్నారు. గడచిన 6 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న 770 మంది బంగ్లాదేశీయులను వారి దేశానికి తరలించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది మృతి చెందిన విషయం విదితమే. నాటి నుంచి ఇప్పటివరకూ పోలీసులు రాజధాని వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 470 మంది బంగ్లాదేశ్ వలసదారులను, మరో 50 విదేశీయులను గుర్తించారు, వారిలో బంగ్లాదేశకు చెందిన వారిని అగర్తలాకు విమానంలో తరలించి, భారత భూ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్‌కు పంపించారు.
బంగ్లాదేశ్(Bangladesh) నుంచి అక్రమంగా వచ్చిన వలసదారులను, రోహింగ్యాలను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ధృవీకరణ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించిందని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 2024, నవంబర్ 15, 2025 ఏప్రిల్ 20 మధ్య కాలంలో 220 మంది అక్రమ వలసదారులను, 30 మంది గడువు దాటి దేశంలోనే ఉంటున్న విదేశీయులను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారని సమాచారం. కాగా ‘పహల్గామ్’ ఘటన తర్వాత కొంత అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, వెరిఫికేషన్ డ్రైవ్‌లు నిర్వహించి, బంగ్లాదేశ్ వలసదారులను, రోహింగ్యాలను అదుపులోకి తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు అందాయని పోలీసులు తెలిపారు. మరోవైపు బంగ్లాదేశ్, మయన్మార్ నుండి వచ్చిన అక్రమ వలసదారుల ఆధారాలను ధృవీకరించడానికి రాష్ట్రాలకు 30 రోజుల గడువు ఇచ్చారు. వారి పత్రాలు ధృవీకరణ పొందకపోతే వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ వలసదారుకు సౌకర్యాలు కల్పించి, వారు భారత్‌లో స్థిరపడటానికి ఏర్పాట్లు చేసిన వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశాయి.
ఇది కూడా చదవండి: పాక్‌కు దమ్ము లేదు.. అందుకే ఉగ్రవాదులను పంపుతోంది: ప్రధాని మోదీ