పాక్‌కు దమ్ము లేదు.. అందుకే ఉగ్రవాదులను పంపుతోంది: ప్రధాని మోదీ | Pakistan knows it cannot win a direct war PM Modi | Sakshi
Sakshi News home page

పాక్‌కు దమ్ము లేదు.. అందుకే ఉగ్రవాదులను పంపుతోంది: ప్రధాని మోదీ

May 27 2025 1:19 PM | Updated on May 27 2025 2:47 PM

Pakistan knows it cannot win a direct war PM Modi

గాంధీనగర్‌: ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం గుజరాత్(Gujarat) పర్యటనలో  ఉన్నారు. నేడు(మంగళవారం) ఆయన గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో రూ.5,536 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను  ప్రారంభించడంతో పాటు, పలు అభివృద్ది పనులను శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ పాకిస్తాన్ తీరుపై దుమ్మెత్తిపోశారు. తాను రెండు రోజులుగా గుజరాత్‌లో ఉన్నానని, ఎక్కడికి వెళ్లినా రెపరెపలాడే త్రివర్ణ పతాకాన్ని చూశానన్నారు. ప్రజల హృదయాల్లో మాతృభూమిపై ఉన్న అపారమైన ప్రేమ, దేశభక్తిని చూశానన్నారు. శరీరం ఎంత బలంగా లేదా ఆరోగ్యంగా ఉన్నా, ఒక ముల్లు(ఉగ్రవాదం) నిరంతర నొప్పిని కలిగిస్తుందని, అందుకే ఆ ముల్లును తొలగించాలని మేము నిర్ణయించుకున్నామన్నారు.

1947లో భారతమాత రెండు ముక్కలుగా విడిపోయింది. ఆ రాత్రే కశ్మీర్ గడ్డపై మొదటి ఉగ్ర దాడి జరిగింది. ముజాహిదీన్ పేరుతో ఉగ్రవాదుల సహాయం తీసుకుని పాకిస్తాన్ ఇండియాలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ రోజు ఈ ముజాహిదీన్లను అంతమొందించేందుకు సర్దార్ పటేల్ సలహాను అంగీకరించి ఉంటే, గడచిన 75 ఏళ్లుగా  కొనసాగుతున్న ఉగ్రవాద ఘటనలు జరిగేవి కాదని మోదీ పేర్కొన్నారు. పీఓకేను తిరిగి  దక్కించుకనేంత వరకు భారత సైన్యం తిరిగి రాకూడదని సర్దార్ పటేల్(Sardar Patel) కోరుకున్నారు. అయితే ఆయన మాటలను నాడు ఎవరూ అంగీకరించలేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

దాని ఫలితం 75  ఏళ్లుగా అనుభవిస్తున్నాం. ఇప్పుడు పహల్గామ్‌ రూపంలో చూశాం. పాకిస్తాన్ తో యుద్ధం జరిగినప్పుడల్లా, భారతదేశ సైనిక శక్తి పాకిస్తాన్‌ను ఓడిస్తూ వచ్చింది. యుద్ధంలో ఏనాటికీ భారత్‌ను ఓడించలేమని పాకిస్తాన్‌కు తెలుసు. అందుకే  అది పరోక్ష యుద్ధానికి దిగింది. ఉగ్రవాదులను సిద్ధం చేయడం ప్రారంభించి, వారిని భారతదేశంపైకి ఉసిగొల్పుతోంది. మొన్నటి ఆపరేషన్‌ సింధూర్‌లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను గుర్తించి, 22 నిమిషాల్లో కూల్చివేశాం. అంతా కెమెరా ముందే జరిగింది. మే 6న  ఉగ్రవాదుల మృతదేహాలకు పాకిస్తాన్‌లో ప్రభుత్వ గౌరవం లభించింది. వారి శవపేటికలపై పాకిస్తాన్ జెండాలు రెపరెపలాడాయి. అక్కడి సైన్యం వారికి సెల్యూట్ చేసింది. పాకిస్తాన్  పన్నిన యుద్ధ వ్యూహమని ఇది రుజువు చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

ఒకప్పుడు ఉప్పు తప్ప మరేమీ లేని గుజరాత్ నేడు ప్రపంచంలో వజ్రాలకు ప్రసిద్ధి చెందిందని ప్రధాని మోదీ  పేర్కొన్నారు. రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి కోసం రాబోయే 10 సంవత్సరాలకు మనం ఇప్పటి నుండే ప్రణాళికలు రూపొందించాలి. అప్పటికి గుజరాత్  పారిశ్రామిక, వ్యవసాయం, విద్య , క్రీడా రంగాలలో ఎక్కడికి చేరుకుంటుందో మనం ఒక దార్శనికతను నిర్దేశించుకోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ‘జగన్నాథ్‌’ పేరుపై హక్కులెవరివి?

Advertisement
 
Advertisement
Advertisement