‘జగన్నాథ్‌’ పేరుపై హక్కులెవరివి? | Puri Jagannath Temple Body To Apply For Patents On Names, Check Out The Full Story For Details | Sakshi
Sakshi News home page

‘జగన్నాథ్‌’ పేరుపై హక్కులెవరివి?

May 27 2025 8:22 AM | Updated on May 27 2025 9:49 AM

Jagannath Temple Body to Apply for Patents on Names

భువనేశ్వర్‌: ఆమధ్య ఒడిశాలలోని పూరి జగన్నాథ్‌ ఆలయంలో నాలుగు తలుపులు తెరిచే విషయంలో వివాదం నెలకొంది. ఆ తర్వాత ‘రత్న భంఢార్‌’ తాళం విషయంలోను గందరగోళం చోటుచేసుకుంది. ఇప్పుడు తాజాగా ఆలయానికి సంబంధించిన కొన్ని పేర్లపై పేటెంట్‌(Patent) కోరుతూ పరిపాలన కమిటీ ఒక డిమాండ్‌ను తెరముందుకు తెచ్చింది.

పశ్చిమ బెంగాల్‌(West Bengal)లోని దిఘాలో గల జగన్నాథ ఆలయానికి ‘జగన్నాథ్‌ థామ్‌’గా పేరు పెట్టడంపై ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ మధ్య వివాదం నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో పూరీలోని జగన్నాథ ఆలయ కమిటీ ఆలయానికి సంబంధించిన మరో అంశాన్ని లేవనెత్తింది. జగన్నాథ ఆలయ పవిత్రత, వారసత్వం, ప్రత్యేక గుర్తింపును కాపాడుకునేందుకు చట్టపరంగా చేపట్టాల్సిన చర్యల కోసం డిమాండ్‌ చేస్తున్నట్లు ఆలయ పరిపాలన అధికారులు తెలిపారు.

సోమవారం పూరిలో సమావేశమైన ఆలయ నిర్వహణ కమిటీ ఆలయానికి సంబంధించిన ‘శ్రీమందిర్’, ‘జగన్నాథ్ ధామ్’, ‘మహాప్రసాద్’, ‘శ్రీక్షేత్ర’ ‘పురుషోత్తమ ధామ్’ తదితర పదాల పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు తెలిపింది. ఉన్నత స్థాయి సమావేశంలో దీనికి ఆమోదం లభించిందని ఆలయ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధీ  పేర్కొన్నారు. ఈ ఆలయానికి సంబంధించిన పదాలకు పేటెంట్ కోరడం అనేది జగన్నాథ ఆలయం ప్రత్యేక గుర్తింపును కాపాడేందుకు ఉద్దేశించిన చట్టపరమైన చర్య అని ఆలయ ప్రధాన నిర్వాహకులు అరబింద పాధీ పేర్కొన్నారు.

జగన్నాథుని ఆలయానికి సంబంధించిన పవిత్ర పదజాలాన్ని విచక్షణారహితంగా ఉపయోగించడాన్ని నిరోధించడానికి ఈ నిర్ణయం  కీలకమైనదన్నారు. గత నెలలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Chief Minister Mamata Banerjee) దిఘాలోని జగన్నాథ ఆలయాన్ని ‘జగన్నాథ్ ధామ్’గా అభివర్ణించారు. ఇది విమర్శలకు దారితీసింది. ‘ధామ్‌’ అనేది సాంప్రదాయకంగా పూరీలోని జగన్నాథ ఆలయానికి వర్తిస్తుందని ఆది శంకరాచార్యులు.. పూరి, బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరంలను ధామాలుగా పేర్కొన్నారనే వాదన వినిస్తోంది. దిఘా ఆలయం అధికారిక పేరు నుండి ‘జగన్నాథ్ ధామ్’ అనే పదాన్ని తొలగించాలని కోరుతూ ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి  ఇటీవల సీఎం మమతా బెనర్జీకి లేఖ రాసినప్పటికీ, ఆమె దీనిపై ఇంతవరకూ స్పందించలేదు. 

ఇది కూడా చదవండి: ముంబై: నీట మునిగిన మహా నగరం.. 107 ఏళ్ల రికార్డు బద్దలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement