
ముంబై: మహారాష్ట్రలోని ముంబైని వానగడం ఇప్పట్లో వీడేలా లేదు. ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకూ ఎడతెరిపి లేకుండా ముంబైని ముంచెత్తిన వర్షం కాస్త తెరిపిచ్చినప్పటికీ, ఇప్పుడు(మంగళవారం ఉదయం) మళ్లీ తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం దక్షిణ ముంబైలో మళ్లీ భారీ వర్షం ప్రారంభమైంది.

ఈ నేపధ్యంలో మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు నగరానికి వాతావరణ శాఖ(Meteorological Department) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ సమయంలో భారీ నుండి అతి భారీ వర్షాలు ముంచెత్తుతాయని తెలిపింది. గడచిన 24 గంటల్లో ముంబైకి జారీ చేసిన రెండవ రెడ్ అలర్ట్ ఇది. నారిమన్ పాయింట్, వార్డ్ మున్సిపల్ హెడ్ ఆఫీస్, కొలాబా పంపింగ్ స్టేషన్, కొలాబా ఫైర్ స్టేషన్ తదితర ప్రాంతాలలో ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు 200 మి.మీకి మించిన వర్షం కురిసింది. ఫలితంగా రోడ్లు జలమయం అయ్యాయి. సాధారణ జీవితం స్తంభించిపోయింది.

గడచిన 24 గంటల్లో ముంబైలో కురిసిన వర్షపాతం 107 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. గత 75 ఏళ్లలో నగరంలో రుతుపవనాల ప్రభావం ఇంత భారీ స్థాయిలో ఉండటం ఇదే తొలిసారని వాతావరణ శాఖ పేర్కొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విమాన, లోకల్ రైళ్ల కార్యకలాపాలు నిలిచిపోయాయి. రెండు వారాల క్రితమే ప్రారంభించిన మెట్రోలోని ఒక భూగర్భ స్టేషన్ నీటితో నిండిపోయింది. దీనితో అధికారులు ఈ మార్గంలో కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. కుర్లా, సియోన్, దాదర్, పరేల్‌తో సహా అనేక లోతట్టు ప్రాంతాలు వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున వాహనాలు వరదలతో నిండిన వీధుల గుండా వెళుతున్న దృశ్యాలు కనిపించాయి.

థానేలో పరిస్థితిని సమీక్షించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడం, ఫలితంగా కురిసిన భారీ వర్షపాతం ముంబైలోని అనేక ప్రాంతాలలో ముంపునకు కారణంగా నిలిచిందన్నారు. ముంబైలో రుతుపవనాలు షెడ్యూల్ కంటే 16 రోజులు ముందుగానే వచ్చాయి. గత సంవత్సరం రుతుపవనాలు జూన్ 25న మహారాష్ట్ర రాజధానికి చేరుకున్నాయి. కాగా రుతుపవనాలు శనివారం కేరళకు చేరుకున్నాయి.
ఇది కూడా చదవండి: పాక్‌లో జ్యోతి మల్హోత్రాకు వీఐపీ సెక్యూరిటీ