‘అఖిలేశ్‌ తన ఎంపీలను కాపాడుకోవాలి’ | Om Prakash Rajbhar Political Counter To SP Akhilesh Yadav Amid Defection Rumours, Says Akhilesh Must Protect His MPs | Sakshi
Sakshi News home page

‘అఖిలేశ్‌ తన ఎంపీలను కాపాడుకోవాలి’

Jun 19 2026 7:06 AM | Updated on Jun 19 2026 10:13 AM

Om Prakash Rajbhar Political Counter To SP Akhilesh Yadav

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ)కి చెందిన పార్లమెంట్‌ సభ్యులు కొందరు వేరు కుంపటి పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలపై యూపీ మంత్రి, సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ చీఫ్‌ ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఎస్‌పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ తమ ఎంపీలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసుకోవాలని సూచించారు.

అలాగే.. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ ద్వారా రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. కొందరు తిరుగుబాటు ఎంపీలు బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వీరికి రెబల్‌ బల్లియా కుమారుడి నాయకత్వంలో బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. పార్టీలో బ్రాహ్మణులకు జరుగుతున్న అవమానాలే ఇందుకు కారణమన్నారు. ఎస్‌పీలో చీలిక తథ్యమంటూ గత రెండు రోజులుగా ఆయన ఇలాంటి ప్రకటనలు చేస్తుండటం గమనార్హం. ఇందులో నేరుగా ఆయన ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ, సనాతన్‌ పాండేను ఉద్దేశించే అయి ఉండొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ పుకార్లను కొట్టివేసిన అఖిలేశ్‌ యాదవ్‌.. రాజ్‌భర్‌ను పుకార్ల శాఖ మంత్రిగా అభివర్ణించారు.

ఎన్‌డీఏపై కాంగ్రెస్‌ ధ్వజం 
మరోవైపు.. ప్రతిపక్షాల నుంచి అధికార ఎన్డీఏలోకి కొనసాగుతున్న వలసలకు హోం మంత్రి అమిత్‌ షా కుట్రలే కారణమని కాంగ్రెస్‌ నిందించింది. ఎన్‌డీఏను అమిత్‌ షా నేషనల్‌ డిఫెక్టర్స్‌ అలయన్స్‌ (జాతీయ ఫిరాయింపుదారుల కూటమి)గా మార్చేశారని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ గురువారం మీడియాతో మాట్లాడారు. అధికార ఎన్‌డీఏ కూటమికి లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీని సాధించేందుకు అమిత్‌ షా చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టడానికి తమ పార్టీ మిత్రపక్షాలతో సంప్రదింపులు జరుపుతోందని ఆయన చెప్పారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement