న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ పరీక్ష నిర్వహణలో తెలెత్తిన అవకతవకల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. విపక్షాలు ఆయన రాజీనామా చేయాలంటూ గట్టిగా పట్టుబడుతున్నప్పటికీ, బీజేపీ మాత్రం ప్రధాన్‌కు అండగా నిలుస్తోంది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, గట్టిగా వెనకేసుకొస్తుండటం వెనుక బలమైన రాజకీయ, ఎన్నికల వ్యూహాలు దాగి ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
బీజేపీ ట్రబుల్ షూటర్.. అమిత్ షా తర్వాత..
ధర్మేంద్ర ప్రధాన్ కేవలం మంత్రి మాత్రమే కాదు, బీజేపీ అగ్రనాయకత్వంలో అత్యంత నమ్మకమైన ఎన్నికల వ్యూహకర్త. అమిత్ షా తర్వాత పార్టీలో సంక్లిష్టమైన ఎన్నికల వ్యవహారాలను చక్కదిద్దగల సమర్థుడిగా ఆయనకు పేరుంది. ఎలాంటి హడావుడి లేకుండా, తెరవెనుక ఉండి వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట. విబేధాలను పరిష్కరించడం, రాష్ట్రాల నాయకత్వాలను సమన్వయం చేయడం, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో ప్రధాన్ శైలి ప్రత్యేకం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు పార్టీలో ఆయన స్థానాన్ని మరింత పటిష్ఠం చేశాయి.
ఒడిశాలో చారిత్రాత్మక విజయం
2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయం ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ ఎదుగుదలకు మైలురాయిగా నిలిచింది. ఒడిశాకు చెందిన సీనియర్ నేతగా, అక్కడ దాదాపు 24 ఏళ్ల నవీన్ పట్నాయక్ సుదీర్ఘ పాలనకు ముగింపు పలకడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ అద్భుత విజయంతో ఒడిశాలో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిందీ మాట్లాడే రాష్ట్రాలకే పరిమితం కాకుండా, ఇతర ప్రాంతాలకు పార్టీని ఎలా విస్తరించాలో ప్రధాన్ తన వ్యూహాలతో నిరూపించారు. ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం, దేశవ్యాప్త రాజకీయ నెట్‌వర్క్ ఆయనను పార్టీలో కీలక నేతగా మార్చాయి.
హర్యానా, బిహార్‌లలో ఊహించని విజయాలు
రాజకీయంగా ఎంతో సవాలుతో కూడుకున్న రాష్ట్రాల్లో ధర్మేంద్ర ప్రధాన్ తన వ్యూహాలతో పార్టీని గెలిపించారు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసినా.. ప్రధాన్ నేతృత్వంలో బీజేపీ వరుసగా మూడోసారి విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్‌డీఏ కూటమి ఘనవిజయం సాధించడంలో క్షేత్రస్థాయి వ్యూహకర్తగా ప్రధాన్ కీలక పాత్ర పోషించారు. సీట్ల సర్దుబాటు, కూటమి నిర్వహణను ఆయన సమర్థవంతంగా అదుపు చేశారు.
యూపీ టర్నింగ్ పాయింట్.. నందిగ్రామ్ సంచలనం
భారతదేశంలోనే అత్యంత సంక్లిష్టమైన 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ధర్మేంద్ర ప్రధాన్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. బూత్ స్థాయి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, 255కు పైగా స్థానాలతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా చేశారు. అంతకుముందు 2017 ఉత్తరాఖండ్ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 57 స్థానాలు సాధించడంలో, 2014 జార్ఖండ్ గెలుపులో ఆయన పాత్ర ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘నందిగ్రామ్’ నియోజకవర్గ బాధ్యతలను ప్రధాన్ తీసుకుని, మమతా బెనర్జీపై సువేందు అధికారి విజయం సాధించేలా వ్యూహాలు రచించడం బీజేపీ చరిత్రలో ఒక మైలురాయి.
లీకుల వివాదం ఉన్నా..
నీట్ వివాదం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నందున విపక్షాల డిమాండ్ సమంజసమే అయినప్పటికీ, బీజేపీ మాత్రం ప్రధాన్ రాజీనామాకు ఒప్పుకోవడం లేదు. రాజకీయ విశ్లేషకురాలు నీర్జా చౌదరి అభిప్రాయం ప్రకారం.. విపక్షాల ఒత్తిడికి తలొగ్గి ఇప్పుడు ప్రధాన్‌తో రాజీనామా చేయిస్తే, అది ఒక సంప్రదాయంగా మారి భవిష్యత్తులో మరిన్ని రాజీనామాలకు విపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉందని బీజేపీ భయపడుతోంది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో పవన్ బన్సల్, కామన్వెల్త్ గేమ్స్ వివాదాల సమయంలో ఇలాగే జరిగిందని పార్టీ గుర్తు చేసుకుంటోంది. ఒకవేళ ప్రధాన్‌ను మార్చాలనుకున్నా, విపక్షాల ఒత్తిడితో కాకుండా తర్వాత ఎప్పుడైనా క్యాబినెట్ విస్తరణలో భాగంగానే ఆ పని చేయవచ్చని ఆమె విశ్లేషించారు.
జవాబుదారీతనంపై చర్చ
మరోవైపు నీట్, సీబీఎస్‌ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్-స్క్రీన్ మార్కింగ్ అవకతవకల నేపథ్యంలో విద్యాశాఖలో మంత్రుల జవాబుదారీతనంపై తీవ్ర చర్చ నడుస్తోంది. రాజకీయ విశ్లేషకుడు నిఖిల్ జైన్ ప్రకారం.. పార్టీకి రాజకీయంగా, సంస్థాగతంగా అవసరమైన నాయకులను మంత్రులుగా నియమించడం సాధారణమే. అయితే, మంత్రిత్వ శాఖ పరిధిలో వివాదాలు వచ్చినప్పుడు మంత్రులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. రోజువారీ పరిపాలనను బ్యూరోక్రాట్లు (అధికారులు) చూసుకున్నప్పటికీ, విధానపరమైన నిర్ణయాలు, ప్రజలకు, పార్లమెంటుకు సమాధానం చెప్పే బాధ్యత మంత్రులదే. గతంలో రైలు ప్రమాదాలు జరిగినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి, నితీష్ కుమార్ వంటి నేతలు రాజీనామా చేసిన ఉదాహరణలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: అమెరికా-ఇరాన్ యుద్ధం: ప్రపంచాన్ని కుదిపేసిన మహా నష్టం


