‘నాన్న ముఖంపై దిండుతో అదిమి..’ తల్లి దారుణాన్ని బయటపెట్టిన బాలుడు | Mummy Just Watched boy 9 says Father Deah | Sakshi
Sakshi News home page

‘నాన్న ముఖంపై దిండుతో అదిమి..’ తల్లి దారుణాన్ని బయటపెట్టిన బాలుడు

Jun 18 2025 12:39 PM | Updated on Jun 18 2025 12:51 PM

Mummy Just Watched boy 9 says Father Deah

అల్వార్: రాజస్థాన్‌లోని అల్వార్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళ  కాంట్రాక్ట్‌ కిల్లర్ల సాయంతో భర్తను హత్య చేసింది. అయితే ఈ కేసులో ఆ మహిళ తొమ్మిదేళ్ల కుమారుడే సాక్షిగా నిలవడం విశేషం. అల్వార్‌లోని ఖేర్లి ప్రాంతంలో ఈ హత్యోదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన వీరు అలియాస్‌  మాన్ సింగ్ జాతవ్‌ ఇంట్లో మృతి చెందాడు. అతని భార్య అనిత తన భర్త అనారోగ్యంతో చనిపోయాడని తెలిపింది. అయితే వారి కుమారుడు పోలీసులకు ఇంటిలో జరిగిన విషయమంతా చెప్పడంతో 48 గంటల్లో నిజానిజాలు వెలుగు చూశాయి.

పోలీసులకు ఆ పిల్లాడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరోజు రాత్రి అతని తల్లి ఇంటి ప్రధాన గేటును తెరచివుంచింది. ఇంతలో ఆ  బాలుడు ‘అంకుల్‌’(కాశీరామ్‌ ప్రజాపతి) అని పిలిచే వ్యక్తితో పాటు నలుగురు ఇంటిలోనికి ప్రవేశించారు. తరువాత వారంతా కలిసి.. మంచంపై పడుకున్న వీరు ముఖంపై తలగడ అదిమిపెట్టి, ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ పక్కనే నిద్రిస్తున్నట్లు నటించిన ఆ బాలుడు జరిగిన ఘటనను గమనించాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనిత, కాశీరామ్‌ ముందుగానే వీరు‌ హత్యకు ప్లాన్ చేశారు. తమ వివాహేతర సంబంధానికి వీరు అడ్డుగా ఉన్నాడని భావించి, ఈ దారుణానికి పాల్పడ్డారు. అనిత స్థానికంగా ఒక చిన్న జనరల్ స్టోర్ నిర్వహిస్తుండగా, కాశీరామ్ కచోరీలు విక్రయిస్తుంటాడు.  అతను తరచూ అనిత దుకాణానికి వస్తుండేవాడు. ఈ నేపధ్యంలో ఇద్దరూ దగ్గరయ్యారు. అనిత, కాశీరామ్‌లు.. కాంట్రాక్ట్ కిల్లర్లకు రూ.రెండు లక్షలు ఇచ్చి, వీరును  హత్య చేయించారనే ఆరోపణలున్నాయి.

వీరు మృతిచెందాక, అతను అనారోగ్యంతో మరణించాడని అనిత బంధువులకు చెప్పింది. అయితే వారు అనుమానంతో మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్య పరీక్షల అనంతరం వీరు హత్యకు గురైనట్లు వైద్యులు గుర్తించారు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఆ ప్రాంతంలోని 100 కి పైగా సీసీటీవీ ఫుటేజ్ క్లిప్‌లను పరిశీలించారు. కాల్ డేటా రికార్డులను విశ్లేషించారు. అనిత, కాశీరామ్‌లతో పాటు కాంట్రాక్ట్ కిల్లర్లలో ఒకరైన బ్రిజేష్ జాతవ్‌ను అరెస్టు చేసిన పోలీసులు మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Maharashtra: ‘ఇకపై హిందీ తప్పనిసరి కాదు’

Advertisement
 
Advertisement
Advertisement