పోలీసులతో నిందితులు
అనకాపల్లి టౌన్: పట్టణ ప్రాంతానికి చెందిన ఓ బాలికపై లైంగిక దాడి కేసులో బాలిక తల్లితో పాటు సచివాలయ ఉద్యోగిని అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ జి. ప్రేమ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన అందించిన వివరాలివి. పట్టణంలోని ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకొని ఒక ప్రైవేట్ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నట్టు అందిన సమాచారం మేరకు విచారణ జరపగా లైంగిక దాడి విషయం వెలుగు చూసిందన్నారు.
కుటుంబ కలహాల కారణంగా భర్తతో విడిపోయిన ఒక మహిళకు శారదానగర్‌కు చెందిన ఓ సచివాలయ ఉద్యోగితో పరిచయం ఏర్పడిందన్నారు. సదరు ఉద్యోగి కూడా తన భార్యకు దూరంగా ఉంటూ బాలిక తల్లితో సహజీవనం చేస్తున్నాడని తెలిపారు. ఈ క్రమంలో డబ్బు ఆశతో బాలిక తల్లి బాలికను కూడా సచివాలయ ఉద్యోగితో బలవంతంగా లైంగిక దాడి జరిపించినట్టు దర్యాప్తు తేలిందన్నారు. ఈ మేరకు బాలిక తల్లితో పాటు సచివాలయ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని నాయస్థానం ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు. ప్రస్తుతం బాధిత బాలికను వన్‌స్టాప్ సెంటర్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు.


