సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు సరుకుల సరఫరా టెండర్ల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినులకు అవసరమైన నిత్యావసర వస్తువుల సరఫరా కోసం చేపట్టిన టెండర్ల ప్రక్రియపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భారీగా గోల్‌మాల్ జరుగుతుందనే చర్చ జోరందుకుంది.
సెంట్రలైజ్డ్ టెండర్ విధానం పేరుతో భారీ స్థాయిలో కాంట్రాక్టుల కేటాయింపులు జరిగాయి. టీడీపీ నేతలు చెప్పిన వాళ్లకే టెండర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే స్థానికంగా జరిగే కొనుగోళ్లకు బదులుగా మొత్తం ప్రక్రియను కేంద్రీకరించడం వల్ల పారదర్శకతపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఇక.. కేజీబీవీ పాఠశాలలకు సరుకుల సరఫరా కోసం దాదాపు రూ.178 కోట్ల విలువైన టెండర్లను కేవలం నలుగురు కాంట్రాక్టర్లకు అప్పగించినట్లు సమాచారం. ఈ ఎంపిక విధానం, సరఫరా ధరలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ధరల నిర్ణయంపై అభ్యంతరాలు
సరుకుల ధరల విషయంలోనూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మార్కెట్ ధరలతో పోలిస్తే కొన్ని వస్తువులకు రేట్లు పెంచేసి.. ఎక్కువ ధరలు నిర్ణయించారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కోడిగుడ్డు ధర విషయంలో మధ్యాహ్న భోజన పథకంలో ఉన్న ధరలతో పోల్చుతూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. చిల్లర సామాన్ల విషయంలోనూ చినబాబు టీం దోపిడీకి దిగిందనే విమర్శలూ వెల్లువెత్తున్నాయి.
విద్యార్థుల కోసం ఉద్దేశించిన నిధులు సక్రమంగా వినియోగించాల్సిన అవసరం ఉందని, ప్రతి రూపాయి ఖర్చుపై పారదర్శకత ఉండాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
కేంద్రీయ బండార్‌కు టెండర్‌పై చర్చ
ఈ టెండర్లలో కేంద్రీయ బండార్‌కు అవకాశం కల్పించడంపై కూడా విమర్శలు వినవస్తున్నాయి. గతంలో విజిలెన్స్ సంబంధిత అంశాలు ప్రస్తావనకు వచ్చిన సంస్థకు మళ్లీ అవకాశం ఇవ్వడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే టెండర్ల ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందా? అర్హతల పరిశీలన ఎలా జరిగింది? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
16 నుంచి కొత్త సరఫరా వ్యవస్థ
కొత్తగా ఎంపికైన కాంట్రాక్టర్ల ద్వారా ఈ నెల 16 నుంచి కేజీబీవీ పాఠశాలలకు సరుకుల సరఫరా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టెండర్ల ఎంపిక, ధరల నిర్ణయం, సరుకుల నాణ్యతపై మరింత చర్చ సాగుతోంది. కేజీబీవీ విద్యార్థినుల అవసరాలకు సంబంధించిన ఈ సరఫరా వ్యవస్థలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ప్రభుత్వం పర్యవేక్షణ పెంచాలని పలువురు కోరుతున్నారు.
చిల్లర సరుకుల కొనుగోలు నుంచి కోట్ల రూపాయల టెండర్ల వరకు.. విద్యాశాఖలో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రగడకు కారణమవుతోంది. అసలు టెండర్ల ప్రక్రియలో ఏం జరిగింది? అనేదానిపై ప్రభుత్వం ఇవ్వబోయే వివరణపై అందరి దృష్టి నెలకొంది.


