సాక్షి, ఏలూరు: ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం పుట్లగట్లగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో, హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వివరాల ప్రకారం.. పుట్లగట్లగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవేపై బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉండటంతో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్న గాయపడిన వారిని ఆసుపత్రి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


