ఆక్వా రైతుకు బాబు వెన్నుపోటు
రూ.1.50కే యూనిట్ విద్యుత్ లబ్ధి ఎగ్గొట్టేందుకు పన్నాగం
పవర్ ఫ్యాక్టర్ 0.90 నుంచి 0.95 మధ్య లేకుంటే సబ్సిడీ కట్
2027 మార్చిలోగా పవర్ ఫ్యాక్టర్ 0.95కు ఏమాత్రం తగ్గినా భారీగా విద్యుత్ బిల్లు
ఇప్పటికే ఆక్వా రైతులకు సంక్షిప్త సందేశాలు పంపి హెచ్చరిస్తున్న డిస్కంలు
షరతుల మేరకు పీఎఫ్ తగ్గకుండా చూసుకోవాలంటే రైతులపై అదనపు భారం
చిన్న, మధ్య తరహా చెరువులకే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చు
సాక్షి, అమరావతి: వెన్నుపోటుకు ట్రేడ్ మార్క్ వంటి చంద్రబాబు ఆక్వా రెతులకు షాక్ ఇచ్చారు. రూ.1.50కే యూనిట్ విద్యుత్‌ను మరిన్ని ఫారాలకు విస్తరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2026 జూన్ 1 నుంచి ఈ రాయితీని వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే, ఈ ఉత్తర్వుల్లోనూ పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) పేరుతో కఠిన నిబంధన విధించారు. అంతేకాకుండా 2027 మార్చిలోగా పీఎఫ్ 0.90 నుంచి 0.95 మధ్య ఉండేలా చూసుకోకపోతే సబ్సిడీ వర్తించదని స్పష్టం చేశారు. ఆక్వా రైతులు ఆ మేరకు పీఎఫ్ ప్రమాణాలు పాటించాలంటే భారీగా డబ్బులు వెచ్చించక తప్పదు. దీంతో రాయితీని ఎగవేసేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ విధంగా మెలిక పెడుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫారాల వర్తింపులోనూ మోసమే
ఇప్పటికే రాయితీని అందుకుంటున్న ఆక్వా విద్యుత్ సర్వీసులతోపాటు అదనంగా 12,500 ఫారాలకు ఈ రాయితీ వర్తిస్తుందని ఈ ఏడాది జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఆదేశాల్లో వెల్లడించింది. కానీ మంగళవారం ఇంధన శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం అప్సడా, సీఏఏ చట్టాల కింద రిజిస్టర్ అయిన సుమారు 6,500 ఆక్వా ఫారాలకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించారు.
కొత్తగా ప్రకటించిన ఆక్వా జోన్లలోని అర్హత ఉన్న ఫారాలు కూడా పరిధిలోకి వస్తాయని, భవిష్యత్తులో రిజి్రస్టేషన్ చేసుకునే ఫారాలకు రిజి్రస్టేషన్ తేదీ నుంచి రాయితీ ఇస్తామని చెప్పారు తప్ప ఆ సర్వీసులు సంఖ్యను ఉత్తర్వుల్లో పొందుపరచలేదు. దానికి తోడు కొత్తగా రాయితీ పొందేవారితో పాటు ఇప్పటికే పొందుతున్న వారికీ పీఎఫ్ షరతులు విధించారు. ఈ నిబంధన వేలాది చిన్న, మధ్య తరహా రైతులను రాయితీకి దూరం చేసే ప్రమాదం ఉందని ఆక్వా రంగ నిపుణులు చెబుతున్నారు.
రైతులను హెచ్చరిస్తున్న డిస్కంలు
రూ.1.50 యూనిట్ విద్యుత్ ప్రయోజనం పొందాలంటే ముందుగా ప్రభుత్వం పెట్టిన పవర్ ఫ్యాక్టర్ ప్రమాణాన్ని అందుకోవాల్సిందే. అది సాధించకపోతే సబ్సిడీ ఉండదని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉంది. అంటే రాయితీ ఉన్నా.. షరతు దాటితే పూర్తి ప్రయోజనం దూరమయ్యే పరిస్థితి. మీ విద్యుత్ కనెక్షన్ పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) ప్రస్తుతం తక్కువగా ఉంది. అధిక బిల్లులు రాకుండా ఉండాలంటే పవర్ ఫ్యాక్టర్‌ను 0.95 కంటే ఎక్కువగా ఉంచండి అంటూ ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్)లు ఆక్వా రైతుల సెల్‌ఫోన్లకు హెచ్చరిక సందేశాలు పంపిస్తున్నాయి. అంటే ప్రభుత్వం రాయితీకి కనీస అర్హతగా పీఎఫ్ తగ్గకూడదని పేర్కొనడమే ఓ కుట్ర అయితే, విద్యుత్ సంస్థలు మరో అడుగుముందుకు వేసి 0.95 కంటే ఎక్కువ పీఎఫ్ ఉండాలని చెబుతున్నాయి.
ఎడాపెడా బాదుడే
ఇప్పటికే ఫీడ్ ధరలు పెరగడం, డీజిల్ ఖర్చులు అధికమవడం, ఎగుమతి మార్కెట్లలో ధరల తగ్గుదల, రొయ్యలకు వ్యాధులు వంటి సమస్యలతో ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి విద్యుత్ రాయితీ కాస్త ఊరట అవుతుందనుకుంటే, ఇప్పుడు అదీ వచ్చేలా కనిపించడం లేదు. ఉదాహరణకు ఒక ఆక్వా ఫారం నెలకు 10 వేల యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే యూనిట్‌కు రూ.1.50 రాయితీ ప్రకారం నెలకు రూ.15 వేలు చొప్పున ఏడాదికి రూ.1.80 లక్షల వరకు ఆదా అవుతుంది.
కానీ పీఎఫ్ నిబంధన కారణంగా అర్హత కోల్పోతే ఈ మొత్తం రైతు భరించాల్సి వస్తుంది. లేదా అదనంగా పీఎఫ్ సరిచేసేందుకు రూ.లక్ష వరకు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. ప్రభుత్వం విద్యుత్ రాయితీతో పాటు పవర్ ఫ్యాక్టర్ మెరుగుపరిచే కెపాసిటర్ బ్యాంకులు, కంట్రోలర్ల కొనుగోలుపై సబ్సిడీ లేదా ప్రత్యేక సహాయం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పవర్ ఫ్యాక్టర్ షరతు కారణంగా వేలాది మంది ఆక్వా రైతులు రాయితీకి దూరమయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
పవర్ ఫ్యాక్టర్‌తో భారీ భారం
పవర్ ఫ్యాక్టర్ అనేది విద్యుత్‌ను ఎంత సమర్థవంతంగా వినియోగిస్తున్నామో తెలిపే సూచిక. ఇది 1.00కు దగ్గరగా ఉంటే మంచిది. కానీ ఆక్వా ఫారాల్లో నిరంతరం పనిచేసే ఏరేటర్లు, బ్లోయర్లు, వాటర్ పంపులు, మోటార్లు వంటి ఇండక్టివ్ లోడ్ల కారణంగా పీఎఫ్ తగ్గడం అనేది అత్యంత సహజం. ముఖ్యంగా చిన్న రైతుల వద్ద పవర్ ఫ్యాక్టర్ సరిచేసే కెపాసిటర్ బ్యాంకులు లేదా ఆటోమేటిక్ కంట్రోల్ పరికరాలు ఉండవు.
ప్రభుత్వ నిబంధన ప్రకారం పీఎఫ్‌ను మెరుగుపరిచి, రాయితీ పొందాలంటే రైతులు అదనంగా ఖర్చులు భరించాల్సి వస్తుంది. నిపుణుల అంచనాల ప్రకారం చిన్న ఫారాలకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు, మధ్య తరహా ఫారాలకు రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు, పెద్ద ఫారాలకు అంతకంటే ఎక్కువ ఖర్చు కావచ్చు. రాయితీ కోసం ఈ అదనపు పెట్టుబడి పెట్టడం రైతులకు భారంగా మారుతుంది.


