దామోదర్‌ నాయుడుకే మళ్లీ చాన్స్‌ | Damodar Naidu gets another chance as Director of Animal Husbandry Department | Sakshi
Sakshi News home page

దామోదర్‌ నాయుడుకే మళ్లీ చాన్స్‌

Aug 12 2026 5:53 AM | Updated on Aug 12 2026 5:53 AM

Damodar Naidu gets another chance as Director of Animal Husbandry Department

పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా మరోసారి నియమించేందుకు సన్నాహాలు 

ఉద్యోగ, అధికారుల సంఘాలన్నీ వద్దని ఉద్యమిస్తున్నా.. 

ఏ మాత్రం పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం 

50 మందికిపైగా ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారస్‌ లేఖలతో నేడో రేపో పునర్నియామక ఉత్తర్వులు జారీ 

సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్టు వెల్లడించిన ఉద్యోగ,అధికార సంఘాలు  

సాక్షి, అమరావతి: పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ పోస్టు వ్యవహారం మళ్లీ వివాదంగా మారింది. ఏడాది క్రితం పదవీ విరమణ పొందిన డాక్టర్‌ టి.దామోదర్‌ నాయుడిని డైరెక్టర్‌గా మరోసారి నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గతేడాది ఆగషు్టలో ఆయన్ని పునర్నియమిస్తూ జారీచేసిన జీవోను హైకోర్టు రద్దు చేసినా.. దామోదర నాయుడిని మరో ఏడాది పాటు కొనసాగించేలా ప్రయత్నాలు జరుగుతుండడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. రిటైర్‌ అయిన సొంత సామాజిక వర్గానికి చెందిన అధికారి కోసం సర్వీస్‌ రూల్స్‌ పక్కన పెడుతున్నారని, వరుసగా రెండో ఏడాది కూడా నిబంధనలకు విరుద్ధంగా పునర్నియమించడం ద్వారా డిపార్ట్‌మెంట్‌లో పదోన్నతుల ఛానల్‌ దెబ్బతింటుందని, అర్హులైన అధికారుల అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా దామోదరనాయుడు 2024 అక్టోబర్‌ 17న బాధ్యతలు చేపట్టారు. 2025 జూలై 31న పదవీవిరమణ పొందారు. ఆ వెంటనే  డైరెక్టర్‌ పోస్టుకు అర్హులైన అధికారుల సీనియార్టీ జాబితాను జీవో ఎంఎస్‌ నెం.14 ద్వారా విడుదలచేశారు. సరిగ్గా అదే సమయంలో తనకు మరో ఏడాది అవకాశం ఇవ్వాలని రిటైర్‌ అయిన దామోదరనాయుడు ప్రభుత్వానికి వ్యక్తిగతంగా అభ్యర్థించడం, ఆయన్ని పునర్నియమిస్తూ 2025 ఆగష్టు 6న జీవో ఆర్టీ నెం.285జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. పరిపాలనా సౌలభ్యం పేరిట జరిగిన ఈ పునర్నియామకాన్ని సవాల్‌ చేస్తూ ఉద్యోగ, అధికారుల సంఘాలు హైకోర్టును ఆశ్రయించారు.  

పదోన్నతుల ద్వారా మాత్రమే భర్తీ చేయాలి.. 
పశుసంవర్ధక చట్టం ప్రకారం 62 ఏళ్ల తర్వాత స్టాట్యుటరీ పోస్టులో కొనసాగడం చెల్లదు. 1996 సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం డైరెక్టర్‌ పోస్టును కేవలం పదోన్నతుల ద్వారా మాత్రమే భర్తీ చేయాలి. కానీ దామోదరనాయుడు నియామకంలో ఇవేమీ పాటించలేదు. మరొక వైపు ఈ పునర్నియామకాన్ని సవాల్‌ చేస్తూ ఉద్యోగ, అధికారుల సంఘాలు హైకోర్టును ఆశ్రయించగా, సింగిల్‌ బెంచ్‌ పునర్నియామక జీవోను రద్దు చేసింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు దాదాపు ఆర్నెల్ల పాటు కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులకు కోర్టు దిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. 

సరిగ్గా అదే సమయంలో జీవో రద్దుపై అప్పీల్‌కు వెళ్లడం, జీవో రద్దుపై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్‌ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా, ఉద్యోగ, గెజిటెడ్‌ అధికారుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కాగా ఇప్పటికే ఈ పునర్నియామకం వలన ఏపీ ఎల్‌డీఏ ఎండీగా పనిచేస్తూ ఇటీవలే రిటైర్‌ అయిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మట్టపర్తి శ్రీనివాసరావు డైరెక్టర్‌ అవకాశాన్ని కోల్పోయారు. ఆయన తర్వాత ప్రస్తుతం డిపార్టుమెంట్‌లో డైరెక్టర్‌ హోదాలో ఏపీ షీప్‌ అండ్‌ గోట్‌ ఫెడరేషన్‌ ఎండీ డాక్టర్‌ రెడ్నం దామోదర నాయుడుతో పాటు ఏపీఎల్‌డీఏ ఎండీ సింహాచలం కొనసాగుతున్నారు. 

వీరితో పాటు డాక్టర్‌ సత్య కుమారి, డాక్టర్‌ రజనీ కుమారి, డాక్టర్‌ రత్నకుమారిలు అదనపు డైరెక్టర్‌ హోదాలో పనిచేస్తూ డైరెక్టర్‌ పోస్టుకు అర్హత కలిగి ఉన్నారు. ఈపునర్నియామక సంస్కృతి వలన డైరెక్టర్‌ నుంచి ఏడీ వరకు దాదాపు 200 మందికిపైగా అధికారుల పదోన్నతుల ఛానల్‌ దెబ్బతింటుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దామోదరనాయుడు పునర్నియామక గడువు ఆగష్టు 5తో ముగిసింది. అయినా సరే మరో ఏడాది కొనసాగేందుకు మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారు. ఎలాగైనా సరే ఈయన్ని టీడీపీ ప్రభుత్వం ఉన్నన్నాళ్లూ కొనసాగించేందుకు టీడీపీలోని ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement