breaking news
Damodar Naidu
-
దంపతులపై బరితెగించిన బాస్
సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి పాలనలో నాయకులు, పోలీసులే కాదు.. పాలకపక్ష నేతల అడుగులకు మడుగులొత్తే కొందరు అధికారులు సైతం పేట్రేగిపోతున్నారు. చేతిలో అధికారం, పెద్దల ఆశీర్వాదం ఉందన్న ధీమాతో కిందిస్థాయి వారిని ఇష్టారాజ్యంగా వేధిస్తున్నారు. పశుసంవర్థక శాఖలో ఓ ఉన్నతాధికారి ఓ అడుగు ముందుకేసి దంపతులపై చెయ్యెత్తి కొట్టేందుకు బరితెగించారు. బదిలీల్లో తాము దరఖాస్తు చేసుకోకపోయినా బదిలీ అయిందని.. పైగా పోస్టింగ్ ఇవ్వలేదని అడగడమే వారు చేసిన నేరం. ఆ వివరాలు..స్పౌజ్ గ్రౌండ్లో పశు వైద్యులు డాక్టర్ సురేష్ విశాఖ జిల్లా పరవాడ మండలం వాడచీపురపల్లిలోనూ, డాక్టర్ పద్మలీల గాజువాక డిస్పెన్సరీల్లో మూడేళ్లుగా పనిచేస్తున్నారు. తాజా బదిలీల్లో వారు దరఖాస్తు చేసుకోకపోయినప్పటికీ పద్మలీలను బదిలీచేశారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. తమ గోడు చెప్పుకునేందుకు విజయవాడ వచ్చిన ఈ దంపతులపై పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి. దామోదరనాయుడు చేయిచేసుకున్నంత పనిచేశారు. ‘నిబంధనల మేరకే బదిలీలు చేశాం.. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే వెళ్లి ప్రభుత్వానికి చెప్పుకోండి.. మీరు కోరుకున్న చోట పోస్టింగ్‌లు ఇవ్వడం కుదరదు’.. అంటూ గుడ్లురుముతూ ఆగ్రహంతో ఊగిపోయారు. చెయ్యెత్తి కొట్టేందుకు వారి మీదకు దూసుకెళ్లారు.‘కొట్టాలనుకుంటే కొట్టండి.. మీకు దండం పెట్టి అడుగుతున్నా.. అప్లై చేయకుండా ఎలా బదిలీ చేస్తారు? కనీసం ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారో కూడా చెప్పకపోతే ఎలా?’.. అంటూ డాక్టర్ సురేష్ దంపతులు వాపోయారు. ‘ముందు మీరిక్కడ నుంచి వెళ్లిపోండి. పోస్టింగ్ ఆర్డర్స్ పంపిస్తాం’.. అంటూ బలవంతంగా వారిని అక్కడ నుంచి పంపించేసిన కొద్దిసేపటికే వారిద్దరికీ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. వాడచీపురపల్లి నుంచి ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడకు సురేష్‌ను.. ఆయన ఖాళీచేసిన వాడచీపురపల్లికి ఆయన భార్య పద్మలీలను పంపించారు. ఈ ఘటన ఒక్కటే కాదు.. పశుసంవర్థక శాఖలో జరిగిన తాజా బదిలీల్లో ఉన్నతాధికారుల లీలలు కోకొల్లలు. జీఓ–23 ప్రకారం.. ఐదేళ్లు నిండిన వారిని విధిగా బదిలీ చేయాలి.దరఖాస్తు చేస్తేనే రెండేళ్లు దాటిన వారిని బదిలీ చేయాలి. కానీ, ఆచరణకు వచ్చేసరికి ఈ నిబంధనలకు తిలోదకాలిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి పార్టీ నేతల సిపార్సు లేఖలు ఉంటే చాలు అడ్డగోలుగా బదిలీలు చేసేశారు. ముడుపులు ముట్టజెప్పిన వారికైతే కోరుకున్న చోట పోస్టింగ్‌లు ఇచ్చారు. సిఫార్సులున్నాయనే సాకుతో 5–7 ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారి జోలికిపోని ఉన్నతాధికారులు, పనిచేసేచోట ఆరునెలల సర్వీస్ కూడా పూర్తికాని వారిని పైరవీలతో బదిలీలు చేశారు. ఓ సామాజికవర్గానికి చెందిన వారికైతే కోరుకున్న చోట కోరుకున్న పోస్టింగ్‌లు ఇచ్చారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాధాన్యత గల కీలక విభాగాల్లో తమకు అనుకూలంగా ఉన్న వారికి పోస్టింగ్‌లు ఇచ్చుకున్నారని డైరెక్టర్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ప్రశ్నిస్తే దాడికి యత్నిస్తారా?బదిలీల్లో నిబంధనలు పాటించలేదు. దరఖాస్తు చేయకపోయినా, ఐదేళ్లు నిండకపోయినా అడ్డగోలుగా బదిలీలు చేశారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే నానా దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించడం, బెదిరించడం, దాడికి సైతం యత్నించడం చేస్తున్నారు. డాక్టర్ సురేష్ దంపతులపట్ల పశుసంవర్థక శాఖ డైరెక్టర్ దామోదరనాయుడు ప్రవర్తించిన తీరే ఇందుకు నిదర్శనం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. – డాక్టర్ సీహెచ్ కృష్ణారావు, చైర్మన్, ఏపీ పశుసంవర్థక శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ -
బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులో ఉంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులోనే ఉందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి.దామోదరనాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరిగిన తూర్పు గోదావరి జిల్లా కానూరు అగ్రహారం, పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు, కృష్ణాజిల్లా బాదంపూడి, కర్నూలు జిల్లా ఎన్.ఆర్.పేట, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం ప్రాంతాల్లో పటిష్ట చర్యలు తీసుకున్నామని, ఫలితంగా ఇతర ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఈ వ్యాధి నిర్ధారణ కాలేదన్నారు. ఆ ఐదు ప్రాంతాల్లో మినహా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో కోళ్లు, గుడ్ల రవాణాపై ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. -
‘వెంకయ్య, చంద్రబాబు నా బంధువులు’
సాక్షి, విజయవాడ: ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయ వైస్ చాన్సిలర్ వివాదం గవర్నర్ వద్దకు చేరింది. యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, రైతులు మంగళవారం రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. అర్హత లేకుండా అధికారం చెలాయిస్తున్న వైస్ చాన్సిలర్ దామోదర్ నాయుడిని రీకాల్ చేయాలని గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం బాధిత శాస్త్రవేత్తలు మీడియాతో మాట్లాడుతూ.. వీసీ దామోదర్ నాయుడి అంశంలో గవర్నర్ తమ ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. అర్హతలు లేకున్నా తెలుగుదేశం ప్రభుత్వం దామోదర్ నాయుడిని ఆ పదవిలో కూర్చొబెట్టిందని వారు ఆరోపించారు. కులపత్రం తప్ప వీసీగా బాధ్యతలు నిర్వహించేందుకు అవసరమైన ఏ సర్టిఫికేట్ దామోదర్ నాయుడి దగ్గర లేదన్నారు. కుల అహంకారంతో దామోదర్ నాయుడు ఇతర ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధిత శాస్త్రవేత్తలు వాపోయారు. వెంకయ్య నాయుడు, చంద్రబాబు మా బంధువలంటూ దామోదర్, ఉద్యోగులను బెదిరించి ఇబ్బంది పెడతున్నాడని వారు మండి పడ్డారు. అనుభవం లేని వ్యక్తికి పగ్గాలు ఇవ్వడం వల్ల విశ్వవిద్యాలయం ర్యాంకింగ్‌లో వెనకబడటమే కాక.. శాస్త్రవేత్తలు, రైతులు కూడా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దామోదర్ నాయుడు యూనివర్సిటీ నిధులను యాక్సిక్ బ్యాంకుకు మళ్లించి కొడుకుకు ఉద్యోగం ఇప్పించాడని ఆరోపించారు. పది రోజుల్లో వీసీపై చర్యలు తీసుకోకపోతే.. ఎన్జీరంగా యూనివర్సిటీతో పాటు అనుబంధంగా ఉన్న అన్ని వ్యవసాయ శాలలకు తాళాలు వేసి ఆందోళనకు దిగుతామని బాధిత శాస్త్రవేత్తలు హెచ్చరించారు. -
200 కిలోల గంజాయి పట్టివేత- ఇద్దరి అరెస్ట్
విశాఖపట్టణం జిల్లా అనంతగిరిలో బుధవారం ఉదయం 200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చెన్నైకి తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరితో పాటు.. గంజాయి రవాణాకు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు అనంతగిరి ఎస్ఐ దామోదరనాయుడు రహదారిలో కాపుకాసి కారును ఆపారు. పెద్దబయలు నుంచి చెన్నైకి గంజాయిని తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు.