గవర్నర్‌ వద్దకు చేరిన ఎన్జీరంగా వీసీ వివాదం

NG Ranga University Scientist Meet Governor Bishwabhushan Harichandan - Sakshi

అర్హత లేని వ్యక్తికి పగ్గాలు

పది రోజుల్లోగా దామోదర్‌పై చర్యలు తీసుకోవాలి

సాక్షి, విజయవాడ: ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సిలర్‌ వివాదం గవర్నర్‌ వద్దకు చేరింది. యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, రైతులు మంగళవారం రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. అర్హత లేకుండా అధికారం చెలాయిస్తున్న వైస్ చాన్సిలర్ దామోదర్‌ నాయుడిని రీకాల్‌ చేయాలని గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం బాధిత శాస్త్రవేత్తలు మీడియాతో మాట్లాడుతూ.. వీసీ దామోదర్‌ నాయుడి అంశంలో గవర్నర్‌ తమ ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. అర్హతలు లేకున్నా తెలుగుదేశం ప్రభుత్వం దామోదర్‌ నాయుడిని ఆ పదవిలో కూర్చొబెట్టిందని వారు ఆరోపించారు. కులపత్రం తప్ప వీసీగా బాధ్యతలు నిర్వహించేందుకు అవసరమైన ఏ సర్టిఫికేట్‌ దామోదర్‌ నాయుడి దగ్గర లేదన్నారు.

కుల అహంకారంతో దామోదర్‌ నాయుడు ఇతర ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధిత శాస్త్రవేత్తలు వాపోయారు. వెంకయ్య నాయుడు, చంద్రబాబు మా బంధువలంటూ దామోదర్‌, ఉద్యోగులను బెదిరించి ఇబ్బంది పెడతున్నాడని వారు మండి పడ్డారు. అనుభవం లేని వ్యక్తికి పగ్గాలు ఇవ్వడం వల్ల విశ్వవిద్యాలయం ర్యాంకింగ్‌లో వెనకబడటమే కాక.. శాస్త్రవేత్తలు, రైతులు కూడా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దామోదర్‌ నాయుడు యూనివర్సిటీ నిధులను యాక్సిక్‌ బ్యాంకుకు మళ్లించి కొడుకుకు ఉద్యోగం ఇప్పించాడని ఆరోపించారు. పది రోజుల్లో వీసీపై చర్యలు తీసుకోకపోతే.. ఎన్జీరంగా యూనివర్సిటీతో పాటు అనుబంధంగా ఉన్న అన్ని వ్యవసాయ శాలలకు తాళాలు వేసి ఆందోళనకు దిగుతామని బాధిత శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top