
సాక్షి, విశాఖపట్నం: తమ ఆందోళనలపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్వార్థంతోనే విద్యార్థులు రాజకీయం చేస్తున్నారని, వారిని ఉపేక్షించేది లేదని తాజాగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ లోకేష్‌కు ఏయూ స్టూడెంట్స్ అల్టిమేటం జారీ చేశారు.
‘‘విద్యార్థులు రాజకీయం చేస్తున్నారా? ఎవరిది రాజకీయం?. మా ఇబ్బందులు చెప్పుకోవడం స్వార్థం అవుతుందా?. వీసీ రాజకీయ ఎజెండాతోనే వచ్చినట్లు మీ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. ఏయూ వీసీ.. గీతం వర్సిటీ కోసం పని చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇలాగే మాట్లాడితే మీ ఇంటిని ముట్టడిస్తాం. తక్షణమే మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి’’ అని విద్యార్థులు హెచ్చరించారు.
ఏయూ విద్యార్థుల ఆందోళనపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏయూ బంద్‌కు విద్యార్థులు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ నిరసనలు కాస్త ఆందోళనలుగా మారాయి. అయితే.. స్వార్థం కోసమే విద్యార్థులు ఆందోళనకు దిగారంటూ మంత్రి లోకేష్ వ్యాఖ్యానించడం గమనార్హం.

కావాలనే విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆంధ్రా వర్సిటీలో రాజకీయం చేస్తున్నాయి. మణికంఠ అనే విద్యార్థి ఫిట్స్ వచ్చి మరణించాడు. ఆంబులెన్స్‌లో ఉన్నప్పటికీ అతని ప్రాణాలు రక్షించలేకపోయారు. అయితే దాని వెనకాల ఏదో ఉందంటూ స్టూడెంట్స్ ఆందోళనలు చేస్తున్నారు. ఇది సరికాదు. కేవలం వాళ్ల స్వార్థం కోసం వాళ్లు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులు మారకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం..
.. వీసీ నియామకాల్లో రాజకీయం ఏం లేదు. విద్యార్థులు చెప్పేది వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తప్పులేమైనా ఉంటే సరిదిద్దుకుంటాం. ఏయూని టాప్ యూనివర్సిటీగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది’’ అని నారా లోకేష్ అన్నారు. మరోవైపు వీసీ రాజశేఖర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. విద్యార్థుల చర్చ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ఒక ఉద్దేశ పూర్వక నిరసనగానే అనిపిస్తోందని అన్నారు.
ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు శుక్రవారం రెండో రోజుకి చేరాయి. వీసీ రాజీనామాను డిమాండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆఫీస్‌ను శుక్రవారం ఉదయం విద్యార్థులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో వాళ్లకు అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి రణరంగంగా మారింది. తమ జుట్టు పట్టుకుని లాగి పడేసి అనుచితంగా ప్రవర్తించారంటూ ఈ సందర్భంగా పలువురు విద్యార్థినిలు మీడియా ఎదుట వాపోయారు.
విద్యార్థుల డిమాండ్లు..
- ప్రతి విద్యార్థికి హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలి
- డిస్పెన్సరీలో సౌకర్యాలను మెరుగుపరచాలి
- ఆక్సిజన్ సిలిండర్స్ ను అందుబాటులో ఉంచాలి
- చనిపోయిన మణికంఠ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి
- వారం రోజుల్లో హామీలపై స్పష్టత ఇవ్వాలి.. లేదంటే విసీ రాజీనామా చేయాలి
విద్యార్థుల డిమాండ్లతో పాటు విద్యార్థులు సమస్యలపై త్రీ మెన్ కమిటీ ఏర్పాటుకు వీసీ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే.. విద్యార్థులు తమ డిమాండ్లను నిర్ణీత కాలపరిమితిలో నెరవేరుస్తామని రాసివ్వాలని కోరగా.. అందుకు వీసీ రాజశేఖర్ అంగీకరించలేదు. అలాగే పదవికి రాజీనామా చేసేది లేదని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.
గత ఏడాది కాలంగా ఏయూలో సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. అయినా వర్సిటీ అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో బీఈడీ స్టూడెంట్ మణికంఠ మృతి చెందడం, ఈ మరణానికి అధికారులే కారణమంటూ విద్యార్థులు ఆరోపిస్తుండడంతో ఆ నిరసనలు ఆందోళనల రూపం దాల్చాయి. మరో వీసీ నియామకం వెనుక రాజకీయాలు నడిచాయన్న ఆరోపణలనూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వస్తోంది. ఈ క్రమంలో వీసీ వైఖరి కారణంగానే రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ధనుంజయరావు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.
