
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రామానుజన్ కళాశాల ప్రిన్సిపాల్ సింగ్‌ను లైంగిక వేధింపుల ఆరోపణలతో సస్పెండ్ చేశారు. దీనిపై తదుపరి ప్రక్రియ కోసం అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) ముందు ఉంచుతామని డీయూ వైస్ ఛాన్సలర్ యోగేష్ సింగ్ చెప్పారు. నిజనిర్ధారణ కమిటీ, ముగ్గురు సభ్యుల పాలకమండలి ప్యానెల్ ఫిర్యాదును పరిశీలించాక ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఆరోపణలలో వాస్తవం ఉందని అన్నారు.
విచారణ సజావుగా, నిస్పాక్షికంగా కొనసాగేందుకు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్పిపాల్ సింగ్‌ను ఈ వ్యవస్థ నుండి దూరంగా ఉండేలా చూసేందుకు సస్పెండ్ చేశామని యోగేష్ సింగ్ తెలిపారు. అయితే సదరు ప్రిన్సిపాల్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. అవి కల్పితమైనవనిగా పేర్కొన్నారు. కాగా ప్రిన్సిపాల్ సింగ్ ప్రధానమంత్రి కార్యాలయ ఫిర్యాదుల విభాగం, డీయూ వైస్ ఛాన్సలర్‌కు రాసిన లేఖలలో ఈ ఫిర్యాదు పూర్తిగా పదోన్నతికి సంబంధించిన సమస్య అని, అయితే దీనిని లైంగిక వేధింపుల కేసుగా మార్చడానికి చేసిన కుట్ర పన్నారని ఆరోపించారు.
అసంపూర్ణ డాక్యుమెంటేషన్ కారణంగా తన పదోన్నతిని అంతర్గత నాణ్యత హామీ సెల్ ఆమోదించలేదని, పదోన్నతి అభ్యర్థనను వెనక్కి తీసుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.ఈ విషయంలో తాను తలొగ్గకపోవడంతోనే తనను లైంగిక వేధింపుల కేసులో ఇరికించారని ప్రిన్సిపాల్ సింగ్ ఆరోపించారు. యూజీసీ నియమాల ప్రకారం ఫిర్యాదును అంతర్గత ఫిర్యాదుల కమిటీకి సమర్పించలేదని, దీనికి బదులుగా కళాశాల పాలక మండలికి, తరువాత డీయూ వీసీకి పంపారని ప్రిన్సిపాల్ ఆరోపించారు. కాగా ఈ అంశాన్ని ఐసీసీ ముందు ఉంచుతామని, ఇప్పటివరకు తాము తీసుకున్న చర్యలు నిబంధనల పరిధిలోనే ఉన్నాయని డీయూ వైస్ ఛాన్సలర్ యోగేష్ సింగ్ స్పష్టం చేశారు.