ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలు | Modi meets Angolan President Lourenco | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలు

May 4 2025 12:58 AM | Updated on May 4 2025 1:29 AM

Modi meets Angolan President Lourenco

ముష్కరులను, వారి మద్దతుదారులను వదిలిపెట్టం  

ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటన  

అంగోలా అధ్యక్షుడు లోరెన్సోతో సమావేశం  

ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని నిర్ణయం  

న్యూఢిల్లీ:  భారత్, ఆఫ్రికన్‌ యూనియన్‌ ప్రగతిశీల భాగస్వామ్యపక్షాలు అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. గ్లోబల్‌ సౌత్‌కు ఇరుపక్షాలు మూలస్తంభాలని చెప్పారు. ఆయన శనివారం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సోతో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంప్రదాయ వైద్యం, వ్యవసాయం, సాంస్కృతిక సహకారం వంటి రంగాల్లో భారత్‌–అంగోలా మధ్య అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అనంతరం ఇరువురు నేతలు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ మరోసారి తేల్చిచెప్పారు. 

పహల్గాంలో పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ముష్కరులను, వారి మద్దతుదారులను శిక్షించడం తథ్యమని స్పష్టంచేశారు. ఉగ్రవాదులపై దృఢమైన, నిర్ణయాత్మక చర్యలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాలు, అంతరిక్ష సాంకేతికత వంటి అంశాల్లో ఇండియా శక్తిసామర్థ్యాలను అంగోలాతో పంచుకుంటామని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ, వజ్రాల ప్రాసెసింగ్, ఎరువులు, ఖనిజాల విషయంలో అంగోలాతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 

అంతకుముందు అంగోలా అధ్యక్షుడు లోరెన్సోకు రాష్ట్రపతి భవన్‌ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మా గాంధీకి లారెన్సో ఘనంగా నివాళులర్పించారు. భారత్‌–అంగోలా మధ్య దౌత్య సంబంధాలు 1985లో ప్రారంభమయ్యాయి. ఆఫ్రియన్‌ యూనియన్‌కు ఈ ఏడాది అంగోలా దేశమే నేతృత్వం వహిస్తోంది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం లోరె న్సో గురువారం భారత్‌కు చేరుకున్నారు.  

అంగోలా సైనిక దళాల ఆధునీకరణకు రూ.1,691 కోట్ల రుణం  
అంగోలా సైనిక దళాల ఆధునీకరణకు తమ వంతు సహకారం కచ్చితంగా అందిస్తామని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఇందుకోసం 200 మిలియన్‌ డాలర్లు(రూ.1,691 కోట్లు) రుణంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడు లోరెన్సో పర్యటన భారత్‌–అంగోలా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశను నిర్దేశిస్తుందని, భారత్‌–ఆఫ్రికా నడుమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement