
జబల్పూర్: యావత్ భారతదేశం, ఆర్మీ ప్రధాని నరేంద్ర మోదీ పాదాల ముందు మోకరిల్లాయంటూ మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీశ్ దేవ్‌డా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని మోదీకి మనం కృతజ్ఞతలు చెప్పాలి. మొత్తం దేశంతో పాటు మన సైన్యం ఆయన పాదాలకు నమస్కరిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం జబల్పూర్‌లో జరిగిన సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ శిక్షణా కార్యక్రమంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన.
జగదీశ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు సిగ్గు చేటు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ ఆ రాష్ట్ర మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగిన సంగతి తెలిసిందే.
విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతగల పదవుల్లో ఉండి దేశానికి రక్షణ కల్పిస్తున్న మహిళా అధికారుల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, మరోసారి వివాదంలో బీజేపీ నేత చిక్కుకోవడంతో మధ్యప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని జగదీష్ దేవ్‌డా మండిపడ్డారు.