ఏఐ తెచ్చిన పెళ్లి సంబంధం.. జేబుకు పెట్టింది పెద్ద కన్నం! | Kanpur Police Bust Huge Fake Matrimonial Scam Ropping Lakhs from Bachelors | Sakshi
Sakshi News home page

ఏఐ తెచ్చిన పెళ్లి సంబంధం.. జేబుకు పెట్టింది పెద్ద కన్నం!

Jun 18 2026 11:07 AM | Updated on Jun 18 2026 11:32 AM

Kanpur Police Bust Huge Fake Matrimonial Scam Ropping Lakhs from Bachelors

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగుచూసిన ఒక విస్తుపోయే మ్యాట్రిమోనియల్ మోసం కలకలం రేపుతోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ), అధునాతన ఎడిటింగ్ టూల్స్ సాయంతో నకిలీ పెళ్లికూతుళ్ల ప్రొఫైళ్లను సృష్టించి, పెళ్లికాని యువకులను నిలువునా ముంచేస్తున్న ఒక కేటుగాళ్ల ముఠాను కాన్పూర్ పోలీసులు రట్టు చేశారు. కేవలం ఫోటోలు, మాయమాటలతో నమ్మిస్తూ, ఒక బాధితుడి నుంచే ఏకంగా నాలుగు లక్షల రూపాయల వరకు వసూలు చేసిన ఈ గ్యాంగ్ ఉదంతం డిజిటల్ యుగంలో జరుగుతున్న సరికొత్త నేరాలకు అద్దం పడుతోంది.

డేటా చోరీ.. మాయమాటల వల
పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ఈ ముఠా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల నుంచి పెళ్లికాని యువకుల వ్యక్తిగత డేటాను సేకరించేది. ఆ తర్వాత తాము నడుపుతున్న కాల్ సెంటర్ల ద్వారా టెలికాలర్లతో మ్యారేజ్ కౌన్సిలర్లుగా ఫోన్లు చేయించేవారు. ‘మీ ప్రొఫైల్‌కు తగ్గ పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికింది’ అంటూ మధురమైన గొంతుతో యువకులను నమ్మించేవారు. ఇంటర్నెట్ నుండి సాధారణ మహిళల ఫోటోలను డౌన్‌లోడ్ చేసి, వాటిని ఏఐ టూల్స్ ద్వారా అత్యంత ఆకర్షణీయమైన ప్రొఫైళ్లుగా మార్చి బాధితులకు పంపేవారు.

విడతల వారీగా దోపిడీ
ఈ గ్యాంగ్ ‘పర్ఫెక్ట్ రిష్తా’, ‘షాదీ మ్యాచ్’, ‘షాదీ మ్యాచ్ ఇండియా’ వంటి నకిలీ వెబ్‌సైట్ల ద్వారా తమ కార్యకలాపాలు సాగించింది. బాధితులు ఆ అందమైన అమ్మాయిల ఫోటోలను చూసి నిజమేనని నమ్మిన తర్వాత అసలు దోపిడీ మొదలయ్యేది. మొదట రిజిస్ట్రేషన్ ఫీజు, ఆ తర్వాత ప్రొఫైల్ యాక్టివేషన్ చార్జీలు, సంబంధం ఖాయం చేయడానికి ఫీజు, చివరికి అమ్మాయితో మాట్లాడించడానికి లేదా ముఖాముఖి భేటీ ఏర్పాటు చేయడానికి అంటూ రకరకాల పేర్లతో లక్షలాది రూపాయలు గుంజేవారు. ఏడాది కాలంలో ఇలా వేలాది మందిని ముంచినా, ఒక్కరికి కూడా పెళ్లి చేయలేదు.

పోలీసుల మెరుపు దాడి.. నిందితుల అరెస్ట్
ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కాన్పూర్ పోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ ఆదేశాల మేరకు, ఐపీఎస్ అధికారిణి అంజలి విశ్వకర్మ నేతృత్వంలో ప్రత్యేక బృందం మూడు చోట్ల ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించింది. ఈ కేసులో రంజిత్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా, లీగల్ సలహాదారుడిగా ఉన్న అమిత్ కుమార్, జాగ్రతి సహా మరికొందరు పరారీలో ఉన్నారు. ఘటనా స్థలం నుండి డజన్ల కొద్దీ మొబైల్ ఫోన్లు, రిజిస్టర్లు, బ్యాంకు పత్రాలు, ఏటీఎం కార్డులు, కంప్యూటర్ సిస్టమ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: నీట్ వివాదం వేళ 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement