రాహుల్‌ కొత్త పొలిటికల్‌ స్ట్రాటజీ.. మొండితనమా.. వ్యూహమా? | INDIA bloc plans bigger protest against Gyanesh Kumar Today Updates | Sakshi
Sakshi News home page

రాహుల్‌ కొత్త పొలిటికల్‌ స్ట్రాటజీ.. మొండితనమా.. వ్యూహమా?

Oct 8 2026 8:49 AM | Updated on Oct 8 2026 8:58 AM

INDIA bloc plans bigger protest against Gyanesh Kumar Today Updates

ఊహించని చోట ప్రత్యక్షం.. చెప్పాపెట్టకుండా నిరసన.. పోలీసుల అడ్డంకులను లెక్కచేయకుండా ముందుకు.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాజకీయ శైలిలో ఈ తరహా ‘సర్‌ప్రైజ్‌ పాలిటిక్స్‌’ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించడం కంటే.. చిన్న బృందంతోనే నేరుగా రంగంలోకి దిగుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇటీవలి కాలంలో మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ రాహుల్‌ ఆకస్మిక నిరసనలు, అనూహ్య మార్చ్‌లు, ముందస్తు సమాచారం లేకుండా కీలక ప్రాంతాలకు వెళ్లడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. కొన్నిసార్లు ఒంటరిగానే.. మరికొన్ని సందర్భాల్లో ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్‌ నేతలతో కలిసి రోడ్డెక్కుతున్నారు. దీంతో రాహుల్‌ రాజకీయ వ్యూహంపై చర్చ మొదలైంది.

మొండితనమా.. వ్యూహమా?
ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా సవరణ అంశంపై తాజాగా ఇండియా కూటమి ఆందోళనలు ఉధృతమయ్యాయి. బుధవారం ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నేతలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేయగా.. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజు కూడా ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్‌ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్‌ చేపట్టి.. ఆకాశవాణి భవన్‌ వద్ద దాదాపు ఎనిమిది గంటల పాటు నిరసన తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గురువారం మరింత పెద్ద ఎత్తున నిరసన చేపట్టాలని కూటమి నిర్ణయించింది.

రాహుల్‌కు కొత్తేమీ కాదు..
అయితే ఈ తరహా రాజకీయ శైలి రాహుల్‌కు ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు. భట్టా-పార్సౌల్‌ రైతుల ఆందోళన సమయంలోనూ ఆయన మోటార్‌ సైకిల్‌పై అక్కడికి వెళ్లి రైతులను కలిశారు. మార్షల్‌ ఆర్ట్స్‌పై ఆసక్తి ఉన్న రాహుల్‌.. భారత్‌ జోడో యాత్ర సమయంలోనూ యాత్రికులతో కలిసి శిక్షణ తీసుకున్నారు. వీధి నిరసనల్లో గంటల తరబడి నడవడం, బైఠాయించడం, పోలీసుల అడ్డంకులను ఎదుర్కోవడంలో ఆయన ఫిట్‌నెస్‌ కూడా కనిపిస్తోంది.

మరోవైపు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు కూడా ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది. 15 మంది నేతలతో కూడిన ప్రతినిధి బృందానికి సమయం కోరగా.. 10 మందికి అనుమతి లభించినట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య రాహుల్‌ గాంధీ ‘సడెన్‌ యాక్షన్‌’ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహమా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: ఎలాన్‌ మస్క్‌కు కేటీఆర్‌ సూటి ప్రశ్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement