నా బిడ్డను కూడా అక్కడి నుంచే తోసేయండి: సియా తండ్రి | If found guilty Siya father demands death penalty | Sakshi
Sakshi News home page

నా బిడ్డను కూడా అక్కడి నుంచే తోసేయండి: సియా తండ్రి

Jun 26 2026 7:16 AM | Updated on Jun 26 2026 10:58 AM

If found guilty Siya father demands death penalty

ముంబై: మహారాష్ట్రలో సంచలనం రేపిన లోహగడ్ కోట హత్యకేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన కుమార్తెపై ఆరోపణలు నిజమని కోర్టు తేల్చితే ఆమెకు అత్యంత కఠిన శిక్ష విధించాలన్నారు. ఇదే సమయంలో అవసరమైతే కేతన్ అగర్వాల్‌ను తోసేసిన అదే కోటపై నుంచి ఆమెను కూడా తోసేయాలని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ గోయల్..‘నా కుమార్తె ఇలాంటి ఘోరానికి పాల్పడిందని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆమె ఎప్పుడూ నాతో అబద్ధం చెప్పలేదు. కానీ పోలీసులు చూపుతున్న ఆధారాలు చూసిన తర్వాత నేను కూడా దిగ్భ్రాంతికి గురయ్యాను. నిజం ఏదైనా కోర్టే తేల్చాలి. చట్టం ముందు అందరూ సమానమే. నేను ముందుగా ఒక పౌరుడిని, తర్వాత తండ్రిని. చట్టం ముందు ఎవరూ పెద్దవారు కాదు. 

నా కుమార్తె నేరం చేసినట్లు రుజువైతే ఆమెకు అత్యంత కఠిన శిక్ష పడాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. నా కూతురు అయినా న్యాయానికి అడ్డుకావద్దు. తండ్రిగా నాకు బాధ ఉన్నా, న్యాయం జరగాల్సిందే’ అని అన్నారు. కాగా, ఈ ఘటనతో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, కుమార్తె అరెస్టు వార్త విన్న తర్వాత షాక్‌కు గురై ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందాల్సి వచ్చిందని కూడా ఆయన వెల్లడించారు.

కేసు ఏమిటి?
మహారాష్ట్రలోని పూణేకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ జూన్ 18న తన నిశ్చితార్థమైన సియా గోయల్‌తో కలిసి లోహగడ్ కోటకు ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయి మరణించినట్లు తొలుత భావించిన పోలీసులు, అనంతర దర్యాప్తులో ఇది పక్కా హత్య అని నిర్ధారించారు. సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి ముందుగానే కుట్ర పన్ని కేతన్‌ను లోయలోకి తోసి చంపినట్లు పోలీసులు ఆరోపించారు. ప్రస్తుతం ఇద్దరూ కస్టడీలో ఉన్నారు. దర్యాప్తు సందర్భంగా సియా, చేతన్ ఒకరిపై ఒకరు నేరారోపణలు చేసుకుంటున్నారని, అయితే ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు సియానే ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి అనే దిశగా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపగా, బాధిత కుటుంబం కూడా నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement