breaking news
Pune Lohagad Fort
-
నా బిడ్డను కూడా అక్కడి నుంచే తోసేయండి: సియా తండ్రి
ముంబై: మహారాష్ట్రలో సంచలనం రేపిన లోహగడ్ కోట హత్యకేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన కుమార్తెపై ఆరోపణలు నిజమని కోర్టు తేల్చితే ఆమెకు అత్యంత కఠిన శిక్ష విధించాలన్నారు. ఇదే సమయంలో అవసరమైతే కేతన్ అగర్వాల్‌ను తోసేసిన అదే కోటపై నుంచి ఆమెను కూడా తోసేయాలని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.తాజాగా మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ గోయల్..‘నా కుమార్తె ఇలాంటి ఘోరానికి పాల్పడిందని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆమె ఎప్పుడూ నాతో అబద్ధం చెప్పలేదు. కానీ పోలీసులు చూపుతున్న ఆధారాలు చూసిన తర్వాత నేను కూడా దిగ్భ్రాంతికి గురయ్యాను. నిజం ఏదైనా కోర్టే తేల్చాలి. చట్టం ముందు అందరూ సమానమే. నేను ముందుగా ఒక పౌరుడిని, తర్వాత తండ్రిని. చట్టం ముందు ఎవరూ పెద్దవారు కాదు. నా కుమార్తె నేరం చేసినట్లు రుజువైతే ఆమెకు అత్యంత కఠిన శిక్ష పడాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. నా కూతురు అయినా న్యాయానికి అడ్డుకావద్దు. తండ్రిగా నాకు బాధ ఉన్నా, న్యాయం జరగాల్సిందే’ అని అన్నారు. కాగా, ఈ ఘటనతో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, కుమార్తె అరెస్టు వార్త విన్న తర్వాత షాక్‌కు గురై ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందాల్సి వచ్చిందని కూడా ఆయన వెల్లడించారు.Ketan Agarwal Siya Goyal this video proves:Not everything you see on SOCIAL MEDIA is real. Filters hide flaws. Edits hide truth. pic.twitter.com/OvfbL3zrt3— बुलेट bhaiya (@bullet_bhaiya_) June 25, 2026కేసు ఏమిటి?మహారాష్ట్రలోని పూణేకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ జూన్ 18న తన నిశ్చితార్థమైన సియా గోయల్‌తో కలిసి లోహగడ్ కోటకు ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయి మరణించినట్లు తొలుత భావించిన పోలీసులు, అనంతర దర్యాప్తులో ఇది పక్కా హత్య అని నిర్ధారించారు. సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి ముందుగానే కుట్ర పన్ని కేతన్‌ను లోయలోకి తోసి చంపినట్లు పోలీసులు ఆరోపించారు. ప్రస్తుతం ఇద్దరూ కస్టడీలో ఉన్నారు. దర్యాప్తు సందర్భంగా సియా, చేతన్ ఒకరిపై ఒకరు నేరారోపణలు చేసుకుంటున్నారని, అయితే ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు సియానే ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి అనే దిశగా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపగా, బాధిత కుటుంబం కూడా నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది. -
అంతా బాగానే ప్లాన్ చేసింది.. ఇదిగో ఇక్కడే దొరికిపోయింది?
పూణే: చేతన్ చౌదరి, సియా గోయల్ క్రైమ్ కథాచిత్రంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లోహ్‌గఢ్ కోట కంటే ముందే గతేడాది దీపావళి తర్వాత కేతన్ అగర్వాల్‌ను హత్య చేయాలని సియా గోయల్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఓ కేఫ్‌లో సియా ఆమె ప్రియుడు చేతన్‌తో కలిసి మర్డర్ ప్లాన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నాటి నుంచి సుమారు ఏడు నెలల కాలంలో సియా-చేతన్ల మధ్య 2004 కాల్స్, 238 గంటల సంభాషణలు జరిగినట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం లోహగడ్ కోట సాక్షిగా జరిగిన ఒక యువ వ్యాపారవేత్త మరణం, కేవలం ఒక ప్రమాదం కాదు.. అది తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఒక పక్కా క్రైమ్ సినిమా అని పూణే రూరల్ పోలీసులు తేల్చారు. ప్రముఖ బిల్డర్ విశాల్ అగర్వాల్ కుమారుడు, 25 ఏళ్ల కేతన్ అగర్వాల్‌ను అతడికి కాబోయే భార్య 20 ఏళ్ల సియా గోయల్, తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి అత్యంత కిరాతకంగా లోయలోకి నెట్టి చంపేసింది.మొదట ట్రెకింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడంటూ అందరినీ నమ్మించిన సియా అసలు రంగు, పోలీసులు జరిపిన లోతైన విచారణలో బయటపడింది. నవంబర్ 25న జైపూర్ రాజభవనంలో చార్టర్డ్ ఫ్లైట్లతో అత్యంత వైభవంగా జరగాల్సిన పెళ్లి, ఈ ఘాతుకంతో మరణానికి దారితీసింది.ఈ కేసులో మొదటి షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే.. జూన్ 18న కేతన్ చనిపోవడానికి కేవలం నాలుగు రోజుల ముందే.. అంటే జూన్ 14న కూడా అదే లోహగడ్ కోటపై అతడిని చంపేందుకు సియా ప్రయత్నించింది. కోట అంచున నిలబడిన కేతన్‌ను ఆమె బలంగా లోయలోకి నెట్టేసింది. కానీ అదృష్టవశాత్తు ఒక చెట్టు కొమ్మను పట్టుకోవడంతో కేతన్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో భయపడిపోయిన కేతన్‌తో.. ‘అక్కడ పాము కనిపించింది, నిన్ను కాపాడబోయే కంగారులో చెయ్యి తగిలింది’ అంటూ సియా నమ్మబలికింది.అయినప్పటికీ అనుమానం రాకుండా, జూన్ 19న తన పుట్టినరోజు వేడుకల కోసం మళ్లీ అదే కోటకు రావాలని కేతన్‌ను మొండిగా ఒప్పించింది. కేతన్ నిరాకరించినప్పటికీ, అతడి తల్లికి ఫోన్ చేసి మరీ ఒప్పించడం ఈ క్రైమ్ స్కెచ్‌లో భాగమేనని పోలీసులు గుర్తించారు.ఈ గుట్టు రట్టు కావడానికి ప్రధాన కారణం సియా గోయల్ వేసిన ఒకే ఒక్క తప్పుడు అడుగని తేలింది. కేతన్ అంత్యక్రియలు ముగిసిన నాలుగు రోజుల తర్వాత ఆమె అతడి ఇంటికి వెళ్ళింది. అక్కడ కేతన్ సోదరి అడిగిన కొన్ని సాధారణ ప్రశ్నలకు సియా తడబడింది. పొంతన లేని సమాధానం ఇచ్చింది. దీంతో సియాపై కేతన్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, 33 డిగ్రీల తీవ్రమైన ఎండలో ఒక వ్యక్తి ముఖం కనిపించకుండా మందపాటి హుడీ ధరించి, హెడ్సెట్ పెట్టుకుని కేతన్, సియాలను వెంబడించడం కనిపించింది. సియా వెనక్కి తిరిగినప్పుడల్లా అతడు కింద కూర్చోవడం పోలీసులకు స్పష్టమైన క్లూ ఇచ్చింది.పోలీసులు సాంకేతిక ఆధారాలను తవ్వడం ప్రారంభించాక మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి గత ఆరు నెలల్లో ఏకంగా 2,004 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు. అంటే దాదాపు 238 గంటల సమయం వారు సంభాషించారు. అంతేకాదు, జూన్ 18 హత్య జరిగిన రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5:40 వరకు చేతన్ తన మొబైల్ ఇంటర్నెట్ ఆఫ్ చేశాడు. పోలీసులు తన లొకేషన్‌ను ట్రాక్ చేయకుండా ఉండేందుకు, తన సొంత ఫోన్‌ను దుకాణంలోనే వదిలేసి, తన ఉద్యోగి ఫోన్‌ను దొంగతనంగా వాడుతూ లోహగడ్ కోటకు చేరుకున్నాడు.ఈ పక్కా ప్లాన్‌తోనే కేతన్‌ను లోయలోకి నెట్టేసి హత్య చేశారు. పోలీసులు చేతన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, కేతన్ అంటే ఇష్టం లేనప్పుడు నిశ్చితార్థం ఎందుకు రద్దు చేసుకోలేదని ప్రశ్నించారు. దానికి అతడు ఇచ్చిన సమాధానం మరింత షాకింగ్‌గా ఉంది. నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని పారిపోతే తన కుటుంబ గౌరవానికి భంగం వాటిల్లుతుందని, సమాజంలో పరువు పోతుందనే భయంతోనే సియా గోయల్ ఆ పని చేయలేదని, అందుకే కేతన్‌ను శాశ్వతంగా అడ్డుతొలగించాలని పథకం రచించినట్లు చేతన్ విచారణలో ఒప్పుకున్నాడు. ప్రస్తుతం లోనావాలా రూరల్ పోలీసులు నిందితులిద్దరిపై హత్య కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. కేతన్ అగర్వాల్ కుటుంబం నిందితులకు ఉరిశిక్ష పడేలా చేయాలని కన్నీటి పర్యంతమవుతూ డిమాండ్ చేస్తోంది.


