24 మంది విద్యార్థినులతో ‘అనుచితం’.. ఉపాధ్యాయుడు అరెస్ట్‌ | Himachal Pradesh Teacher Arrested After 24 Students Filed Compliant On Him, Know More Details Inside | Sakshi
Sakshi News home page

24 మంది విద్యార్థినులతో ‘అనుచితం’.. ఉపాధ్యాయుడు అరెస్ట్‌

Jun 24 2025 11:08 AM | Updated on Jun 24 2025 1:16 PM

Himachal Teacher Arrested 24 Students Compliant

సిర్మౌర్: పవిత్రమైన ఉపాధ్యాయు వృత్తిలో ఉంటూ అనైతిక పనులకు పాల్పడుతున్నవారిని మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇదే కోవలోకి వచ్చే ఉదంతమొకటి హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. మానవత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ పాఠశాలలో 24 మంది బాలికలను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో ఒక ఉపాధ్యాయుడిని అరెస్టు చేసిన ఉదంతం హిమాచల్‌లోని సిర్మౌర్ జిల్లాలో చోటుచేసుకుంది. లైంగిక వేధింపుల కమిటీ సమావేశంలో విద్యార్థులు పాఠశాలలోని గణిత ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. ఆ ఉపాధ్యాయుడిని  అదుపులోకి తీసుకున్న  పోలీసులు అతనిపై పోక్సో చట్టంతో సహా వివిధ విభాగాల కింద కేసు నమోదు చేశారు.

ఆ ప్రభుత్వ పాఠశాలలో శిక్షా సంవాద్ కార్యక్రమం సందర్భంగా, ఎనిమిది నుంచి పదవ తరగతి వరకూ చదువుకుంటున్న 24 మంది విద్యార్థినులు  పాఠశాలలోని ఉపాధ్యాయుని వేధింపులపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఉపాధ్యాయుడు తమను అనుచితంగా తాకారంటూ విద్యార్థులు లిఖితపూర్వక ఫిర్యాదును సమర్పించారు. దీంతో ప్రిన్సిపాల్‌ వారి తల్లిదండ్రులను పిలిపించి, పిల్లలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి  అడగగా, వారు తమకు తెలియదని చెప్పారు. అయితే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంతో పాటు ఆ ఉపాధ్యాయునికి వ్యతిరేకంగా  నినాదాలు చేస్తూ, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే విద్యాశాఖ అధికారులు నిందితుడైన ఉపాధ్యాయుడిని   సస్పెండ్ చేశారు.

రాష్ట్ర పాఠశాల విద్యా డైరెక్టర్ ఈ  ఘటనపై విచారణ  చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వాదనలను రికార్డ్ చేసి, వారంలోపు తన కార్యాలయానికి నివేదిక సమర్పించాలని ఆయన కోరారు. సిర్మౌర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ యోగేష్ రోల్టా మాట్లాడుతూ నిందితుడైన ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి: ట్రంప్‌ ఖాతాలోకి కాల్పుల విరమణ క్రెడిట్?

Advertisement
 
Advertisement
Advertisement