నీట్‌లో భారీగా టాప్‌ స్కోరర్లు | Students concerned about MBBS counseling | Sakshi
Sakshi News home page

నీట్‌లో భారీగా టాప్‌ స్కోరర్లు

Jul 21 2026 5:51 AM | Updated on Jul 21 2026 5:59 AM

Students concerned about MBBS counseling

ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌పై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ 

ఆలిండియా ర్యాంకుల ఆధారంగా అంచనాల్లో నిమగ్నం 

సీట్ల కటాఫ్‌లు 15–30 మార్కుల మేర పెరిగే అవకాశం

సాక్షి, అమరావతి: నీట్‌ యూజీ–2026 ఫలితాలు విడుదల కావడంతో ఎంబీబీఎస్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆలిండియా ర్యాంకులు, మార్కుల ఆధారంగా సీటు అలాట్‌మెంట్‌పై అంచనాల్లో నిమగ్నమయ్యారు. గతేడాది నీట్‌ యూజీ ఫలితాలతో పోలిస్తే ఈసారి మార్కుల సరళి, పోటీలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. టాప్‌ స్కోర్లు సాధించిన వారి సంఖ్య అనూహ్యంగా పెరగడంతో కోరుకున్న చోట సీటు దక్కుతుందో లేదోనన్న ఆదుర్దా ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థుల్లో కనిపిస్తోంది. 

దాదాపు రెండు రెట్లు పెరుగుదల
గతేడాది నీట్‌లో అత్యుత్తమ స్కోర్‌ 686 దగ్గరే ఆగిపోయింది. ఈదఫా 715 వరకూ విద్యార్థులు స్కోర్‌ చేశారు. 501 ఆపైన స్కోర్‌ చేసిన విద్యార్థుల సంఖ్య గతేడాదితో పోలిస్తే దాదాపు రెండు రెట్లు పెరిగిందని చెప్పవచ్చు. జాతీయ స్థాయిలో గతేడాది 501 ఆపైన 51,511 మంది స్కోర్‌ చేయగా ఈ దఫా ఏకంగా 89,341 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 38 వేల మంది విద్యార్థులు అదనంగా ఈ జోన్‌లోకి వచ్చారు. 401 నుంచి 500 మధ్య స్కోర్‌ చేసిన వారు గతేడాది కంటే ఈసారి 25 వేల మందికిపైనే పెరిగారు. టాప్‌ స్కోరర్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే ప్రభుత్వ కోటా ఎంబీబీఎస్‌ సీట్ల కటాఫ్‌లు 15 నుంచి 30 మార్కుల మేర పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తొలుత ఆలిండియా..తర్వాత రాష్ట్ర కోటా
నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసిన స్కోర్లు, ఆలిండియా ర్యాంక్‌ల ఆధారంగా విద్యార్థులు, తల్లిదండ్రులు అంచనాల్లో తలమునకలయ్యారు. రాష్ట్రం నుంచి నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ జాబితా విడుదలైతే రాష్ట్ర స్థాయిలో ఎంబీబీఎస్‌ సీట్లకు నెలకొన్న పోటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నీట్‌ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఎంసీసీ) మరికొద్ది రోజుల్లో ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ప్రకటించనుంది. అనంతరం ఆలిండియా కౌన్సెలింగ్‌కు ఎంసీసీ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌ను ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. 

ఎన్టీఏ నుంచి రాష్ట్ర అర్హుల జాబితా అందాక రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌కు హెల్త్‌ వర్సిటీ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆలిండియా తొలి విడత కౌన్సెలింగ్‌ ముగిశాక రాష్ట్ర స్థాయిలో తొలి విడత మొదలవుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లను ఆలిండియా కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన 85 శాతం సీట్లను, ప్రైవేట్‌ కళాశాలల్లో మొత్తం సీట్లలో 50 శాతం సీట్లను కన్వీనర్‌ కోటా కింద హెల్త్‌ వర్సిటీ భర్తీ చేస్తుంది. ప్రైవేట్‌లో మిగిలిన 50 శాతం సీట్లలో 35 శాతం బీ, 15 శాతం సీట్లను సీ కేటగిరీల కింద వర్సిటీనే నింపుతుంది. ఇక 2023–24 నుంచి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆలిండియా కోటా 15 శాతం పోను మిగిలిన 85 శాతం సీట్లలో సగం కన్వీనర్, సగం సెల్ఫ్‌ ఫైనాన్స్‌కు కేటాయిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement