కోర్టు ధిక్కరణ అలవాటైంది | High Court expresses deep anger against Hydra Commissioner Ranganath | Sakshi
Sakshi News home page

కోర్టు ధిక్కరణ అలవాటైంది

Jul 21 2026 5:47 AM | Updated on Jul 21 2026 5:47 AM

High Court expresses deep anger against Hydra Commissioner Ranganath

ప్రైవేటు ఆస్తిలో జోక్యం చేసుకోవద్దన్నా పదేపదే ఉల్లంఘనలు 

అహంకారపూరిత ధోరణి సరికాదు.. ఇలాంటి ప్రవర్తనను సహించం 

చట్టాన్ని మించి వ్యవహరించే అధికారం మీకు లేదు 

హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంటలోని ప్రైవేటు ఆస్తిలో జోక్యం చేసుకోరాదని ఆదేశాలున్నా.. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ ఆయనకు అలవాటుగా మారిందని, ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదని తేల్చిచెప్పింది. ఇంత అహంకారపూరిత ధోరణి సరికాదని, ఏ పనైనా చట్టానికి లోబడే చేయాలని స్పష్టం చేసింది. ఐపీఎస్‌కు కూడా చెప్పాల్సి రావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఒక కేసులో మూడు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయంటే ఆయనకు కోర్టులపై ఉన్న గౌరవం ఏంటో తెలుస్తోందని వ్యాఖ్యానించింది. 

రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికారులు  ఉత్సాహంగా పనిచేయవచ్చని.. అయితే ప్రతి చర్య చట్ట పరిధిలోనే ఉండాలని పేర్కొంది. చట్టాన్ని అతిక్రమించి ప్రైవేట్‌ ఆస్తిలో జోక్యం చేసుకోవడం సమర్థనీయం కాదంది. ఏవీ రంగనాథ్‌ చట్టానికి అతీతులు కారని.. తమను తాము ’సూపర్‌ కాప్స్‌’గా భావించుకోవద్దని సూచించింది. చట్టాన్ని మించి వ్యవహరించే అధికారం ఆయనకు లేదని తేల్చిచెప్పింది. ఈ కేసులో బాధితులు పిటిషనర్‌ కాదని, కోర్టేనని ఘాటు వ్యాఖ్య చేసింది. కోర్టు చెప్పిన తర్వాత కూడా నేను అనుకున్నదే చేస్తా అనే లెక్కలేనితనంగా వ్యవహరిస్తే.. న్యాయస్థానాలు చూస్తూ కూర్చోవని గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. పిటిషనర్‌పై ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి పూర్తి వివరాలతో మంగళవారం అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.  

రంగనాథ్‌ హాజరుకు పోలీసులను ఆదేశిస్తాం..: గతంలో ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు, హైడ్రా తరఫున కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ అధికారులు ప్రైవేట్‌ భూమిలోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ శాంత శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.నరసయ్య మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎం.హరీశ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ..లోతుకుంట గ్రామంలోని 40 ఎకరాల భూమిపై కోర్టు ఇప్పటికే తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. గతంలో దాఖలైన ధిక్కార కేసులకు సంబంధించి జూన్‌ 10న ఇకపై హైడ్రా అధికారులు పిటిషనర్‌ ప్రైవేట్‌ భూమిలోకి అడుగుపెట్టవద్దని హైకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. 

కానీ జూలై 18న సుమారు 200 మంది సిబ్బంది, 50కి పైగా వాహనాలు, జేసీబీలు, బుల్డోజర్లతో హైడ్రా అధికారులు భూమిలోకి ప్రవేశించి ప్రహరీ, టిన్‌ షెడ్లు, సీసీ కెమెరాలు, గేట్లు, విద్యుత్‌ వ్యవస్థను ధ్వంసం చేశారని, స్థలాన్ని స్వా«దీనం చేసుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. పిటిషనర్‌ను, అతని న్యాయవాదిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రంగనాథ్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్‌ను కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశిస్తామని అన్నారు. సాయంత్రం 6:30 గంటలకు హాజరవుతానని హైడ్రా కమిషనర్‌ చెప్పడంతో విచారణను వాయిదా వేశారు. 

ఉద్దేశపూర్వకంగా ధిక్కరణ 
సాయంత్రం ఏవీ రంగనాథ్‌ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద హడావుడి నెలకొంది. ఏజీ సుదర్శన్‌రెడ్డి, ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్, స్పెషల్‌ జీపీలు, జీపీలు అంతా విచారణకు హాజరయ్యారు. హైడ్రా తరఫున ఏజీ వాదనలు వినిపిస్తూ.. జీఎల్‌ఆర్‌(కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని భూమి) సర్వే నంబర్‌ 243లో 119 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దాని పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిపై సర్వే చేయడానికి, విభజన చేపట్టడానికి కొంత గడువివ్వాలని కోరారు. 

న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ గతంలో కలెక్టర్‌ ఇదే హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఎందుకు విభజనకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జీఎల్‌ఆర్‌ భూమి అని చెబుతున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రతివాదిగా చేర్చలేదన్నారు. ఐపీఎస్‌ అధికారైన ఏవీ రంగనాథ్‌కు చట్టంపై నమ్మకం ఉన్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా ధిక్కరణ తీరుతో వ్యవహరించారన్నారు. కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి అధికారం చెలాయిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement