విజయవాడలోని పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న డాక్యుమెంట్ రైటర్లు
నిలిచిన క్రయ విక్రయాలు
రాష్ట్రవ్యాప్తంగా సేవలన్నీ నిలిపివేత
ప్రభుత్వానికి ఒక్కరోజే రూ.50 కోట్ల నష్టం
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్లు సమ్మెలోకి దిగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దాదాపు స్తంభించింది. డాక్యుమెంట్ రైటర్లు సోమవారం ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సేవలన్నింటినీ నిలిపివేశారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోయాయి. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారితో నిత్యం కిటకిటలాడే కార్యాలయాలు జనం లేక నిర్మానుష్యంగా కనిపించాయి. పలుచోట్ల డాక్యుమెంట్ల రైటర్లు తమ కార్యాలయాల వద్దే నల్ల రిబ్లన్లతో నిరసన తెలిపారు. ఈ సమ్మె కారణంగా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం దారుణంగా పడిపోయింది. రోజూ సగటున 10 వేల రిజిస్ట్రేషన్లు జరిగేవి. తద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.50 నుంచి రూ.60 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి.
ఆదాయం కూడా రూ.4 కోట్ల కంటే తక్కువ వచ్చినట్లు సమాచారం. ఈ 500 రిజిస్ట్రేషన్లలో కూడా ఎక్కువగా రెండు, మూడు రోజుల క్రితం మొదలుపెట్టిన ప్రక్రియకి సంబంధించినవిగా చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు ద్వారా రిజిస్ట్రేషన్ల వ్యవస్థ పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుందని డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సాధారణ ప్రజానీకంలోనూ రిజిస్ట్రేషన్ల ప్రైవేటీకరణపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు కంపెనీలకు ఈ వ్యవస్థను అప్పగిస్తే రాష్ట్రంలోని ఆస్తుల డేటా మొత్తం వారి చేతుల్లోకి వెళ్లి భూముల కబ్జాలు, మోసాలు విచ్చలవిడిగా జరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయినా సరే సీఎం చంద్రబాబు మాత్రం ప్రైవేటీకరణను కొనసాగిస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


