2018–19లో 2.40 శాతం.. 2025–26లో 1.90 శాతం
లోక్‌సభలో వైఎస్ అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి సమాధానం
రెండేళ్ల జీఎస్టీ సెటిల్‌మెంట్ గణాంకాల వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ)లో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రాబడి నిష్పత్తి క్రమంగా క్షీణిస్తోంది. 2018–19లో 2.40 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి 2025–26 ఆర్థిక సంవత్సరానికి 1.90 శాతానికి పడిపోయింది. లోక్‌సభలో సోమవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక గణాంకాలను సభ ముందు ఉంచారు. రాష్ట్ర జీఎస్‌డీపీ పెరుగుతున్నప్పటికీ దానికి అనుగుణంగా జీఎస్టీ రాబడి పెరగడం లేదని కేంద్రం ఇచ్చిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
2017–18లో రూ.10,826 కోట్లుగా ఉన్న పోస్ట్ సెటిల్‌మెంట్ జీఎస్టీ రాబడి 1.40 శాతం నిష్పత్తిని నమోదు చేసింది. 2018–19లో రూ. 8,73,721 కోట్ల జీఎస్‌డీపీకి రూ.20,746 కోట్ల జీఎస్టీతో అత్యధికంగా 2.40 శాతం నిష్పత్తి నమోదైంది. ఆ తర్వాత 2019–20లో 2.20 శాతానికి, 2020–21లో 2.00 శాతానికి తగ్గింది. మళ్లీ 2021–22 నుంచి 2023–24 వరకు వరుసగా మూడేళ్లపాటు 2.20 శాతం వద్ద స్థిరంగా కొనసాగింది. తరువాత 2024–25లో 2.10 శాతానికి, 2025–26లో 1.90 శాతానికి పడిపోయింది. 2025–26లో జీఎస్‌డీపీ రూ.17,62,357 కోట్లుగా అంచనా వేయగా జీఎస్టీ రాబడి రూ.34,301 కోట్లుగా పేర్కొన్నారు.
సంక్షేమ పథకాల నిలిపివేతపై అధ్యయనం జరగలేదు
రాష్ట్రంలో ప్రధాన సంక్షేమ పథకాల నిలిపివేత కారణంగా గృహవినియోగ డిమాండ్ తగ్గడం, ఫలితంగా రిటైల్, ఆహార, వినియోగ వస్తువుల రంగాల నుంచి ఎస్‌జీఎస్టీ వసూళ్లు తగ్గడంపై కేంద్రం అధ్యయనమేదీ చేయలేదని కేంద్రమంత్రి తెలిపారు.
ఆర్థికసంఘం సిఫార్సుల మేరకే గ్రాంట్లు
ఆర్థికసంఘాల ఆమోదిత సిఫార్సుల ఆధారంగానే రాష్ట్రాలకు గ్రాంట్–ఇన్–ఎయిడ్ విడుదలవుతుందని చెప్పారు. నిధుల పంపిణీ (వర్టికల్ డివాల్యూషన్)పై రాష్ట్రాల అభిప్రాయాలను 16వ ఆర్థికసంఘం నివేదికలో పొందుపరిచినట్లు కేంద్రమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
రెండేళ్ల సెటిల్‌మెంట్ గణాంకాలు ఇవే
2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఏపీకి దక్కిన రాష్ట్ర జీఎస్టీ (ఎస్‌జీఎస్టీ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్‌టీ) సెటిల్‌మెంట్ల వివరాలను త్రైమాసికాల వారీగా కేంద్రమంత్రి వివరించారు.
– 2024–25 తొలి త్రైమాసికంలో ఎస్‌జీఎస్టీ రూ.4,012 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.4,557 కోట్లు కలిపి మొత్తం రూ.8,569 కోట్లు దక్కింది. రెండో త్రైమాసికంలో ఎస్‌జీఎస్టీ రూ. 3,230 కోట్లు, ఐజీఎస్‌టీ రూ. 4,596 కోట్లు.. మొత్తం రూ.7,826 కోట్లు, మూడో త్రైమాసికంలో ఎస్‌జీఎస్టీ రూ.3,448 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.4,664 కోట్లు.. మొత్తం రూ. 8,112 కోట్లు, నాలుగో త్రైమాసికంలో ఎస్‌జీఎస్టీ రూ. 3,799 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.4,998 కోట్లు.. మొత్తం రూ.8,797 కోట్లు చొప్పున సెటిల్‌మెంట్ జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.33,301 కోట్లు (ఎస్‌జీఎస్టీ రూ.14,488 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.18,813 కోట్లు) విడుదలయ్యాయి.
– 2025–26 మొదటి త్రైమాసికంలో ఎస్‌జీఎస్టీ రూ.4,027 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.3,952 కోట్లు.. మొత్తం రూ.7,979 కోట్లు, రెండో త్రైమాసికంలో ఎస్‌జీఎస్టీ రూ.3,775 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.4,921 కోట్లు.. మొత్తం రూ.8,696 కోట్లు విడుదలయ్యాయి. మూడో త్రైమాసికంలో ఎస్‌జీఎస్టీ రూ.3,459 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.4,911 కోట్లు మొత్తం రూ.8,370 కోట్లు, నాలుగో త్రైమాసికంలో ఎస్‌జీఎస్టీ రూ.3,951 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.5,305 కోట్లు.. మొత్తం రూ.9,256 కోట్లు విడుదలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.34,301 కోట్లు (ఎస్‌జీఎస్టీ రూ.15,211 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.19,090 కోట్లు) సెటిల్‌మెంట్ జరిగినట్లు మంత్రి తెలిపారు.


