భ్రమరా వెంచర్స్ వద్ద జరుగుతున్న వాగ్వి వాదం
భ్రమరా టౌన్‌షిప్ రోడ్డు విషయంలో వివాదం
రోడ్డు విస్తరణకు ఇనుప కంచె వేసిన టౌన్‌షిప్ యాజమాన్యం
ఘర్షణ పడిన టీడీపీ ఎమ్మెల్యే, మార్కాపురం నేత వర్గీయులు
మార్కాపురం: భూమి, రహదారి వివాదం అధికార తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవికి చెందిన భ్రమరా టౌన్ షిప్ యాజమాన్యం వర్గానికి, మార్కాపురం పట్టణానికి చెందిన టీడీపీ నేత చిలకపాటి చిన్న వెంకట చెన్నయ్య వర్గానికి మధ్య రహదారిపై గేట్, కంచె నిర్మాణం విషయంలో వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంపై ఆదివారం రెండు వర్గాలు ఘర్షణ పడటంతో నలుగురికి గాయాలయ్యాయి. మార్కాపురంలోని పూల సుబ్బయ్య కాలనీకి తూర్పున భ్రమరా టౌన్‌షిప్ వెంచర్ ఉంది. 167 ఎకరాల్లోని ఈ వెంచర్ గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావుకు చెందినదిగా సమాచారం.
వెంచర్ ముందు భాగంలో మార్కాపురం టీడీపీ నేత చిలకపాటి చిన్న వెంకట చెన్నయ్యకు ఆరు ఎకరాలు, మరికొందరికి భూములు ఉన్నట్లు సమాచారం. ప్రధాన రహదారి నుంచి 200 మీటర్ల లోపల ఉన్న భ్రమరా టౌన్‌షిప్‌నకు వెళ్లే మార్గం విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. వెంచర్ యాజమాన్యం గతంలో ఉన్న 30 అడుగుల మెటల్ రోడ్డును విస్తరించి 50 అడుగుల రహదారిగా చేసేందుకు రెండువైపులా ఇనుప కంచె ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతంలోని భూముల యజమానులు తమ స్థలాలకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు.
చిలకపాటి చిన్న వెంకట చెన్నయ్య ఆధ్వర్యంలో ఆయన కుటుంబ సభ్యులు, షేక్ ఇంతియాజ్, షేక్ ఇలియాజ్ సుమారు 30 మందితో రహదారిపై ధర్నా కూడా చేశారు. ఆదివారం భ్రమరా టౌన్‌షిప్ మేనేజర్ విఠల్, శ్రీనివాస్ చౌదరి ఆధ్వర్యంలో గేటు నిర్మాణం చేపట్టారు. ఈ పనులను చెన్నయ్య వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మార్కాపురం టౌన్ పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత ఇనుప గేట్లను కొందరు పక్కనే ఉన్న చెరువులో పడేసినట్లు సమాచారం.
సాయంత్రం ఆ గేట్లను బయటకు తీసేందుకు మేస్త్రి మీరావలి ఆధ్వర్యంలో కూలీలు చెరువులోకి దిగగా, చెన్నయ్య వర్గం అడ్డుకొంది. దీంతో రెండువర్గాల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మేస్త్రి పాణ్యం మీరావలి, అనిల్‌కు గాయాలయ్యాయి. చెన్నయ్య వర్గానికి చెందిన అనకరి మల్లికార్జున, అంబడిపూడి కిరణ్‌కు కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మార్కాపురం టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. కేసులు నమోదు కాలేదని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయమై సోమవారం దళితులు, స్థల యజమానులు పీజీఆర్‌ఎస్‌కు వెళ్లి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందించి ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
ఎమ్మెల్యే నారాయణరెడ్డే దాడి చేయించారు : ఎమ్మెల్యే గల్లా భర్త
తమ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డే దాడి చేయించారని గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు ఓ ప్రకటనలో ఆరోపించారు. అధికారులతో కుమ్మక్కై భ్రమరా వెంచర్‌ను ధ్వంసం చేశారని, సంస్థ ప్రతినిధులపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. మార్కాపురం జేసీ పులి శ్రీనివాస్ కూడా తమపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆయన అవినీతిని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రశ్నించడంతో ఇప్పుడు వేధిస్తున్నారని ఆరోపించారు.


