రాష్ట్రంలో గడువు పెంచాక మరిన్ని ఓట్ల తొలగింపు
రాష్ట్రం మొత్తం మీద 10.48% ఓటర్ల వివరాలు తెలియడం లేదు.. 16.38%
ఓట్ల గల్లంతుతో తిరుపతి జిల్లా ఫస్ట్
4.16 కోట్ల మంది ఓటర్లలో 14.87 లక్షల మంది చనిపోయినట్లు గుర్తింపు
మరో 13.68 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్లిపోయారు
సాక్షి, అమరావతి: మరో 4 రోజుల్లో రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) ఇంటింటి సర్వే ముగియనుంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో 100% ఓట్లను డిజిటలైజ్డ్ చేసినట్లు అధికారులు చెబుతుండగా రాష్ట్రవ్యాప్తంగా 43,62,387 మంది ఓటర్ల వివరాలు తెలియడంలేదు. సోమవారం సాయంత్రం నాటికి 4,16,27,694 మంది ఓటర్లలో 10.48% మంది (43.62 లక్షలు) ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి వచ్చే అవకాశం లేని జాబితాలో ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. జూలై 14తో సర్ ఇంటింటి సర్వే ముగియాల్సి ఉండగా కలెక్టర్లు, రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు గడువును జూలై 24 వరకు పొడిగించడం తెలిసిందే. జూలై 14 నాటికి వివరాలు తెలియని ఓటర్ల సంఖ్య 39,81,399 కాగా ఇప్పుడు మరో 3,80,988 లక్షలు పెరిగి 43,62,387కు చేరుకోవడం గమనార్హం. గడువు పెరిగిన తర్వాత మరింత మంది ఓటర్ల నుంచి ఫారాలు అందకపోగా తొలగించే ఓటర్ల సంఖ్య పెరగడంపై రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. సోమవారం సాయంత్రానికి అధికారిక గణాంకాల ప్రకారం మొత్తం ఓటర్లలో 3.57 శాతం ఓటర్లు అంటే 14,87,008 మందిని మృతులుగా గుర్తించారు. మరో 13,68,337 మంది శాశ్వతంగా వలస వెళ్లిపోగా మరో 8,19,252 మంది ఓటర్ల వివరాలు పూర్తిగా తెలియడం లేదు.
తిరుపతిలో భారీగా తొలగనున్న ఓటర్లు
రాష్ట్రవ్యాప్తంగా తిరుపతి, నెల్లూరు జిల్లాలో భారీగా ఓట్లు తగ్గనుండగా అత్యల్పంగా తగ్గే వాటిలో పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున తెలియని ఓటర్ల శాతం 10.48గా ఉంటే తిరుపతి జిల్లాలో ఏకంగా 16.38 శాతం, నెల్లూరు జిల్లాలో 14.97 శాతంగా ఉంది. 2024 ఓటర్ల జాబితా ప్రకారం తిరుపతి జిల్లాలో 17,69,438 మంది ఓటర్లు ఉంటే అందులో 2,89748 మంది ఓటర్ల వివరాలు అన్ కలెక్టబుల్ జాబితాలో ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 19,74,240 మంది ఓటర్లు ఉంటే అందులో 2.95 లక్షల మంది ఓటర్ల వివరాలు తెలియడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో 14,75,036 ఓట్లు ఉండగా అందులో అతి తక్కువగా 4.89 శాతం అంటే 72,315 మంది ఓటర్ల వివరాలు మాత్రమే తెలియడం లేదు. అందులో 41,061 మంది మృతులు ఉన్నారు. ఏలూరు జిల్లాలో 16,44,193 మంది ఓటర్లు ఉంటే 5.86 శాతం మంది 96,268 మంది ఓటర్ల వివరాలు తెలియాల్సి ఉంది.


