స్కూలు బస్సులకు మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు
ముంబై: విద్యార్థుల భద్రతకు పెద్ద పీట వేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం స్కూలు బస్సులకు కఠిన నిబంధనలను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్కూలు బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు, సీట్ బెల్టులు, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థలను తప్పని సరి చేసింది. స్కూలు బస్సులు, వ్యానులు, విద్యా సంస్థల బస్సుల కనీస చార్జీలను సైతం తామే నిర్ణయిస్తామని తెలిపింది.
2011 నాటి నిబంధనలను మారు స్తూ మహారాష్ట్ర మోటార్ వెహికల్స్ (రెగ్యులే షన్ ఫర్ స్కూల్ బస్సెస్) (మొదటి సవరణ) నిబంధనలు–2026ను ఈ నెల 16వ తేదీన నోటిఫై చేసింది. కిలోమీటర్‌కు చొప్పున ఒక్కో విద్యార్థి నుంచి వసూలు చేసే చార్జీల బేస్ రుసుమును ఆర్‌టీఏలు ఖరారు చేస్తాయని తెలిపింది. గతంలో ఇలాంటి నిబంధనేదీ లేక పోవడం గమనార్హం.
నెలవారీ లేదా మూడు నెలలకు గాను ప్రాంతీయ రవాణాధికారి నిర్ణయించే రుసుముకు 10 శాతానికి తక్కువ కాకుండా, 10 శాతానికి మించకుండా వసూలు చేయవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. నిబంధనల అమలు, విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల ఫిర్యాదుల పరిష్కారం అంశాలపై స్కూల్ ట్రాన్స్‌పోర్ట్ కమిటీ పరిశీలన జరిపి జిల్లా స్కూల్ బస్ సేఫ్టీ కమిటీలకు మూడు నెలలకోసారి నివేదిక అందజేయాల్సి ఉంటుంది.
అదేవిధంగా, కొత్తగా జీపీఎస్ లైవ్ ట్రాకింగ్, పానిక్ బటన్, సీసీటీవీ నిఘా, డిజిటల్ అటెండెన్స్, ఆటోమేటిక్ అలెర్టులు తల్లిదండ్రులకు కూడా అందుబాటులో ఉంచటం తప్పనిసరి చేసింది.
సీసీటీవీ ఫుటేజీని కనీసం 30 రోజులపాటు భద్రపర్చాలి. మొబైల్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచాలని నోటిఫికేషన్‌లో సూచించింది. బస్సులోని అన్ని సీట్లకు బెల్టులను అమర్చేలా నవీకరించాలని కోరింది. బస్సుల్లో అగ్ని ప్రమాదం పై అలారమ్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం తప్పనిసరని తెలిపింది. ఐదో తరగతి వరకు విద్యార్థుల కోసం బస్సుల్లో మహిళా అటెండెంట్‌ను నియమించడం, అవకరాలు కలిగిన చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు తప్పనిసరి చేసింది.


