గార్ధబాలకు గులాబ్‌ జామ్‌లు | Why People In Madhya Pradesh Are Feeding Gulab Jamuns To Donkeys, Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

గార్ధబాలకు గులాబ్‌ జామ్‌లు

Jul 19 2026 4:29 AM | Updated on Jul 19 2026 11:46 AM

Donkeys were fed gulab jamuns in Bhopal

చక్కటి వర్షాలు కురవాలని గాడిదలకు తీపిపదార్థాలు తినిపించిన స్థానికులు

మధ్యప్రదేశ్‌లో వింత ఆచారం

భోపాల్‌: విత్తులు నాటాక కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఆకాశం వంక మేఘాల కోసం చూడటం రైతన్నలకు నేటి యుగంలో సర్వసాధారణమైపోయింది. అయితే మధ్యప్రదేశ్‌లోని కొన్ని మారుమూలప్రాంతాల్లో మాత్రం కొందరు స్థానికులు మూగజీవాలను ప్రసన్నంచేసుకుంటే వరుణుడు వర్షిస్తాడనే బలమైన విశ్వాసం నెలకొని ఉంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ నగరంలోని కోలార్‌ రోడ్‌లో గాడిదలకు కొందరు గులాబ్‌జామ్‌లు ప్లేట్‌లలో పెట్టి తినిపించారు. 

తమ పూర్వీకులు సైతం వర్షాలు సరిగా పడని సందర్భాల్లో అచ్చం ఇలాగే గాడిదలకు తీపిపదార్థాలు ఆహారంగాపెట్టేవాళ్లని స్థానికులు చెప్పారు. వరుణదేవుడైన ఇంద్రుడిని మెప్పించేందుకు గార్ధబాలకు గులాబ్‌జాములు పెట్టడం సరైన పద్ధతి అని మరికొందరు చెప్పారు. ఈ సందర్భంగా జానపద గేయాలను సైతం ఆలపించారు. ఈ ఘటన తాలూకు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లుకొడుతున్నాయి.

 ఈ వింత ఆచారంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే వర్షాలు బాగా కురవాలని కోరుకుంటున్న ఇదే ఇండోర్‌ నగరంలో ఈ సీజన్‌లో సాధారణసగటు కంటే 44 శాతం అధిక వర్షపాతం నమోదైందని భోపాల్‌ వాతావరణవిభాగ సీనియర్‌ అధికారి ఎన్‌ఎస్‌ సాహూ శనివారం ప్రకటించడం విశేషం.అయితే మధ్యప్రదేశ్‌లోని 35 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ఇటీవలే ప్రకటించింది.

 చింధ్వారా, దామోహ్, దిందోరీ, జబల్పూర్, కత్నీ, మేహర్, మాండ్లా, మౌగంజ్, నర్సింగ్‌పూర్,పంధూర్నా, పన్నా, రేవా, సాగర్, సత్నా, శివానీ, షాహ్‌దోల్, సిద్ధీ, సింగ్రౌలీ, తికాంగఢ్, ఉమారియా, అలీరాజ్‌పూర్, బర్వానీ, బేతుల్, దటియా, ధార్, ఝాన్‌బువా, మొరెనా, నర్మదాపురం, రైనెన్, శివ్‌పూర్, శివపురి, అనుప్పూర్, బాలాఘాట్, ఛాతర్‌పూర్, విదిష జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement