HCU: ఇది చాలా సీరియస్‌ విషయం.. తెలంగాణ సర్కార్‌పై ‘సుప్రీం’ ఆగ్రహం | HCU Land Row Hearings In Supreme Court April 3rd Updates | Sakshi
Sakshi News home page

HCU: చెట్లను నరికేస్తారా? ఇది చాలా సీరియస్‌ విషయం.. తెలంగాణ సర్కార్‌పై ‘సుప్రీం’ ఆగ్రహం

Apr 3 2025 11:00 AM | Updated on Apr 3 2025 5:37 PM

HCU Land Row Hearings In Supreme Court April 3rd Updates

న్యూఢిల్లీ, సాక్షి: హెచ్‌సీయూ భూముల వివాదం(HCU Land Issue)పై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.  పర్యావరణ విధ్వంసం చాలా తీవ్రమైన విషయమన్న సుప్రీం కోర్టు.. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? అని తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపివేయాలంటూ గురువారం స్టే ఆదేశాలు జారీ చేసింది.

వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో పోలీసుల సాయంతో హెచ్‌సీయూ భూముల్లో పెద్ద ఎత్తున చెట్లు నరికేశారని ఫిర్యాదు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నాం తర్వాత జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘‘అంత అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. సీఎస్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఏం చేస్తున్నారు?. పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇలా ఎలా చేస్తారు?. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా?.  ఇది చాలా తీవ్రమైన విషయం. అవసరమైతే సీఎస్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటాం’’ అంటూ తదుపరి ఆదేశాలిచ్చేదాకా అన్ని పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉల్లంఘనలు గనుక జరిగితే సీఎస్‌దే బాధ్యత అని జస్టిస్‌ గవాయ్‌ స్పష్టం చేశారు.

ఇక.. హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ నుంచి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు పలువురు అధికారులను తొలగించింది. ఈ నెల 16వ తేదీకల్లా పర్యావరణ కమిషన్‌ (Commission for Environmental Cooperation) పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అమికస్‌ క్యూరీని రిట్‌ పిటిషన్‌తయారు చేయాలని సూచించింది. తెలంగాణ సీఎస్‌ను ప్రతివాదిగా చేర్చిన సుప్రీం కోర్టు.. అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీంకోర్టు స్టే

అంతకు ముందు.. ఈ ఉదయం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వం విక్రయించాలనుకున్న కంచ గచ్చిబౌలి భూముల్ని వెంటనే సందర్శించాలని, ఇవాళ మధ్యాహ్నాం 3.30గం. లోపు నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఆ సమయంలో.. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని, అటవీ భూమి అని ఆధారాలు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ పర్యావరణ విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోబోమని సుప్రీం కోర్టు తాజా విచారణతో ఉద్ఘాటించింది.

Advertisement
 
Advertisement
Advertisement