తేళ్ల పంచమి
తెలంగాణ: దేశమంతా సోమవారం నాగుల పంచమి జరుపుకొంటే నారాయణపేట జిల్లా సరిహద్దు కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లా గురుమిట్కల్ మండలం కందుకూరులో మాత్రం తేళ్ల పంచమి ఘనంగా నిర్వహించారు. ఇక్కడ తేళ్లను దైవస్వరూపంగా భావిస్తూ ఏటా ప్రత్యేకంగా తేళ్ల జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
కందుకూరు గ్రామ సమీపంలోని కొండపై ఉన్న కొండమవ్వ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని, అక్కడే ఉన్న తేళ్ల విగ్రహాలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం కొండపై ఆలయ పరిసరాల్లోని ఏ చిన్న రాయిని తొలగించినా.. వాటి కింద తేళ్లు కనిపించాయి. తేళ్లను చేతితో తాకినా.. పట్టుకున్నా..అవి కుట్టకపోవడం అమ్మవారి దివ్యానుగ్రహమని భక్తులు విశ్వసిస్తారు.
చిన్నారులు, యువత, మహి ళలు, పురుషులు అనే తేడా లేకుండా భక్తులు తేళ్లను చేతుల్లోకి తీసుకుని, చేతులు, పొట్ట, ముఖం తదితర శరీర భాగాలపై పెట్టుకుని జాతరలో సందడి చేశారు. గుట్టపై ఉండే వాతావరణ పరిస్థితులు, వన మూలికల కారణంగా తేళ్లు కుట్టలేకపోతున్నాయని కొందరు విద్యావంతులు చెబుతున్నారు.


