హైదరాబాద్: గాంధీ జయంతిని పురస్కరించుకుని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) హాస్పిటల్ దిల్‌సుఖ్‌నగర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా ప్రోస్టేట్, కిడ్నీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ప్రజల్లో కిడ్నీ, ప్రోస్టేట్ ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడం, ముందస్తు ఆరోగ్య పరీక్షలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని చేపట్టారు. ఈ అవకాశాన్ని 220 మంది పురుషులు, 70 మంది మహిళలతో సహా మొత్తం 300 మంది వినియోగించుకున్నారు.
ఈ వైద్య శిబిరంలో భాగంగా పాల్గొన్న వారికి ప్రోస్టేట్-స్పెసిఫిక్ యాంటిజెన్ (PSA) టెస్ట్, ల్యాబ్ ఆధారిత రాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్, సీరం క్రియాటినిన్ టెస్ట్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్‌లతో సహా సమగ్ర నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, అనంతరం నిపుణులైన వైద్యులతో వ్యక్తిగత సలహాలు, సంప్రదింపులు అందించారు. ఏఐఎన్‌యూ (AINU) హాస్పిటల్ దిల్‌సుఖ్‌నగర్ డిపార్ట్‌మెంట్ హెడ్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస నారాయణం మాట్లాడుతూ.. "కిడ్నీ, ప్రోస్టేట్ సమస్యలు తీవ్రమయ్యే వరకు తరచుగా ఎలాంటి బయటి లక్షణాలు కనిపించవు.
..వ్యాధి ముదిరిన తర్వాతే చాలామంది వైద్యులను ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాల ద్వారా ప్రజలు తమ ఆరోగ్యం పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ప్రోత్సహించడమే మా ఉద్దేశం. ప్రాథమిక దశలోనే పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని ముందే గుర్తించి, సరైన సమయంలో మెరుగైన వైద్య సలహాలు పొందవచ్చు" అని పేర్కొన్నారు.


