సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులపై పోలీసుల నిఘా ముమ్మరమైంది. వీసా గడువు ముగిసినా నగరంలో కొనసాగుతున్న వారిని గుర్తించేందుకు స్పెషల్ బ్రాంచ్, ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ, స్థానిక పోలీసులు, ఐటీ సెల్ సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే 49 మంది అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించి హోల్డింగ్ సెంటర్లకు తరలించగా.. 12 మందిని స్వదేశాలకు పంపించారు. తనిఖీల్లో నకిలీ కరెన్సీ, డ్రగ్స్, మోసాలు, వ్యభిచారం వంటి పలు అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.
టౌలిచౌకి పోలీస్ స్టేషన్-30, లంగర్ హౌస్-6, మెహదీపట్నం-6, రాజేంద్రనగర్-3, బంజారాహిల్స్-2, సైఫాబాద్-1, గుడిమల్కాపూర్-1 విదేశీయుల వివరాలు నమోదయ్యాయి. స్టూడెంట్ వీసాపై ఇండియాకు వచ్చి, వీసా గడువు ముగిసిన తర్వాత కొందరు విదేశీయులు ఆసుపత్రులకు వచ్చే విదేశీ రోగులకు అనువాదకులుగా (ట్రాన్స్‌లేటర్లు), మధ్యవర్తులుగా పనిచేస్తున్నట్లు తేలింది. వీరు రోగుల నుండి భారీగా రుసుము వసూలు చేయడమే కాకుండా, ఆసుపత్రి బిల్లులో దాదాపు 15 శాతం వరకు కమిషన్ పొందుతున్నట్లు గుర్తించారు.
కొందరు విదేశీ మహిళలు వ్యభిచార కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు వెల్లడైంది. టూరిస్ట్ వీసాపై వచ్చి గడువు ముగిసిన తర్వాత కూడా ఉంటున్న ఒక కెన్యా దేశస్తురాలు వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించారు. ఇళ్లు, ఫ్లాట్లు, హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, సర్వీస్ అపార్ట్‌మెంట్లు.. విదేశీయులకు వసతి కల్పించే వారందరూ తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని పోలీసులు సూచించారు. వసతి కల్పించే ముందే విదేశీయుల పాస్‌పోర్ట్, వీసా, ఇతర పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని.. విదేశీయుల నివాస సమాచారాన్ని అధికారులకు తప్పనిసరిగా సమర్పించాలన్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్


