హైదరాబాద్: బతుకమ్మ పండగను ఈ నెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై శనివారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులు హాజయ్యారు. ఈ సందర్భంగా ఈనెల 18వ తేదీన సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని ట్యాంక్ బండ్ పై వేలాది మంది మహిళలతో ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు సంజయ్ జాజు తెలిపారు. 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉండే అమరవీరుల స్మారక కేంద్రం నుంచి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా వచ్చి ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటారని, వీరితోపాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే ప్రత్యేక వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు.
ఈ బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని పండగ శోభ వచ్చేలా నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేయడమే కాకుండా పలు జంక్షన్ల కేంద్రాల వద్ద విధ్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఆడేందుకు సమీపంలోని వాడలు, కాలనీలు, బస్తీల నుంచి పెద్ద ఎత్తున మహిళలు వచ్చే అవకాశం ఉండడంతో వారికి ఏ విధమైన ఇబ్బందులూ లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నెక్లెస్ రోడ్డులో బతుకమ్మల నిమజ్జన ఏర్పాట్లు
అదే విధంగా, ట్యాంక్ బండ్ చిల్డ్రన్స్ పార్క్ లో ఉన్న బతుకమ్మ ఘాట్ తో పాటు నెక్లెస్ రోడ్డులో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ ఎంసీ అధికారులను సీఎస్ ఆదేశించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య ట్యాంకు బండ్ పై బతుకమ్మ ఉత్సవాలు జరుగుతుండడంతో ట్రాఫిక్ డైవర్షన్, బారికేడింగ్, కనీస సౌకర్యాల ఏర్పాట్లను చేపట్టాలని తెలిపారు.
అమరవీరుల స్మారక కేంద్రం నుంచి ట్యాంక్ బండ్ వరకు ప్రత్యేకంగా బారికేడింగ్, లైటింగ్ సౌకర్యాలను కల్పించాలని సూచించారు. బతుకమ్మ జరిగే పది రోజుల పాటు రవీంద్ర భారతిలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తుండడంతో అక్కడ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని టూరిజం కేంద్రాలు, ప్రముఖ ప్రాంతాల్లోనూ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని అన్నారు. బతుకమ్మ ఉత్సవాలను ప్రతిబింబించేలా ఈ సారి ప్రత్యేక లోగోను రూపొందిస్తున్నామని వెల్లడించారు. డిసెంబర్‌లో జరుగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను కూడా ఈ లోగోలో తెలియచేసే విధంగా రూపొందించనున్నట్టు తెలిపారు.


