నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియకు విశేష స్పందన లభించింది. మొదటి విడత దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియడంతో ఆయా నియోజకవర్గాల పరిధిలోని దరఖాస్తుల సంఖ్యను అధికారులు వెల్లడించారు. క్యూర్ పరిధిలో 16 నియోజకవర్గాలకు గానూ మొత్తం 60,014 దరఖాస్తులు వచి్చనట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీవీ గౌతం వెల్లడించారు. కాగా ఇందులో అంబర్‌పేట నుంచి 3,983 దరఖాస్తులు అందాయి.
పేద, మధ్య తరగతి ప్రజలు అధికంగా ఉండే అంబర్‌పేట నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లకు పోటీ నెలకొంది. లబ్ధిదారుల నుంచి అధికారులకు భారీగా దరఖాస్తులు అందాయి. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా రూ.10 వేల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉన్నప్పటికీ స్పందన భారీగానే ఉంది. మిగతా నగరం ఎలా ఉన్నప్పటికీ ఒక్క అంబర్‌పేట నియోజకవర్గంలో మాత్రం ఒక్కో ఇంటికీ 8 మంది లబి్ధదారులు పోటీ పడుతున్నారు.
మొదటి దశలో..
అంబర్‌పేట నియోజకవర్గంలో మొదటి దశలో భాగంగా 480 ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకుగానూ పోలీసు విభాగానికి చెందిన స్థలం ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. అయితే కేటాయించిన 480 ఇళ్లకు గానూ 3,983 దరఖాస్తులు వచి్చనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో కేటాయించిన ఇళ్లకు ఎనిమిది రెట్లు దరఖాస్తులు అందాయి.
లక్కీడ్రాతో..
దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రధాన్యత, అర్హత ఆధారంగా ఈ నెల 20వ తేదీ తర్వాత కంప్యూటరైజ్డ్ పద్ధతిలో పారదర్శకంగా లాటరీ ప్రక్రియ ద్వారా అర్హులైనలబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియకు అర్హతగా కనీసం ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో నివసించి ఉండాలని, ఈ మేరకు లక్కీడ్రాలో కేటాయింపులు ఉండనున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఎంపికైన వారు దశల వారీగా రూ.5.90లక్షలు చెల్లించాల్సి ఉంది.


