సాక్షి, హైదరాబాద్: నగరంలో మెట్రో మరోసారి ప్రయాణికులకు చుక్కలు చూపించింది. సాంకేతిక కారణాలతో అన్ని మెట్రో స్టేషన్‌లలో ఆన్‌లైన్ పేమెంట్ సౌకర్యం నిలిచిపోయింది. దీంతో మ్యానువల్ టికెట్ల కోసం ప్రయాణికులు క్యూలు కట్టారు. ఈ క్రమంలో పలు స్టేషన్ల వద్ద భారీగా రద్దీ నెలకొంది.
మంగళవారం ఉదయం అనూహ్యంగా.. మెట్రో స్టేషన్‌లలో గూగుల్‌పే, ఫోన్‌పే, వాట్సాప్ సేవలు.. ఇలా ఆన్‌లైన్ పేమెంట్ల సర్వీసులు పని చేయలేదు. దీంతో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్ పేమెంట్ల నేపథ్యంలో క్యాష్ దొరక్క చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.
మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికులు సహనం కోల్పోయి అందోళనకు దిగారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యకు కారణం ఏంటన్నదానిపై అధికారులు సరైన వివరణ ఇవ్వలేదు. అయితే రద్దీ, ప్రయాణికుల ఆగ్రహం నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగారు.


