కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులో మానవత్వానికి మచ్చతెచ్చేలాంటి ఘటన వెలుగుచూసింది. చనిపోయిన ఒక చేపల వ్యాపారి సమాధిని గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి వేళ తవ్వి, అతడి మృతదేహంపై ఉన్న బంగారు గొలుసును దొంగిలించారు. కుటుంబ సభ్యులు మృతుడితో పాటే పూడ్చిపెట్టిన ఆభరణాన్ని ఇలా కిరాతకంగా దోచుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. ఈ అమానుష చర్యతో దిగ్భ్రాంతికి గురైన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పీళమేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
సెంటిమెంట్‌గా బంగారు గొలుసు
కోయంబత్తూరు సౌరిపాళ్యం ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల నాగరాజ్ చేపల వ్యాపారం చేస్తూ జీవించాడు. అనారోగ్య కారణాలతో ఆయన జూన్ 6న మరణించగా, మరుసటి రోజే కుటుంబ సభ్యులు స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. నాగరాజ్‌కు తాను ఎప్పుడూ ధరించే చేప ఆకారపు పెండెంట్ ఉన్న బంగారు గొలుసు అంటే ఎంతో ఇష్టం. ఆ సెంటిమెంట్‌తో, ఆయన చివరి కోరికను గౌరవిస్తూ, కుటుంబ సభ్యులు ఆ గొలుసును తీయకుండానే నాగరాజ్ మృతదేహంతో పాటు పూడ్చిపెట్టారు.
16వ రోజు బయటపడిన దారుణం
నాగరాజ్ మరణించిన 16వ రోజు అంత్యక్రియల ఆచారాలను నిర్వహించడానికి ఆయన కుమారుడు వెంకటేష్ కుమార్, ఇతర బంధువులు శ్మశానవాటికకు వెళ్లారు. అక్కడ సమాధి చుట్టూ ఉన్న మట్టిని ఎవరో తవ్వినట్లు గమనించి వారికి అనుమానం వచ్చింది. దీంతో వారు అక్కడ విచారించగా, శ్మశానవాటిక కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల కార్తికేయన్ అసలు విషయం బయటపెట్టాడు. ఇద్దరు స్థానిక వ్యక్తులు రాత్రి వేళ వచ్చి సమాధిని తవ్వి, మృతదేహం నుంచి సుమారు 24 గ్రాముల బరువున్న బంగారు గొలుసును దొంగిలించి పారిపోయారని తెలిసింది.
పోలీసులకు ఫిర్యాదు
ఈ దారుణ ఘటనపై మృతుడి కుమారుడు వెంకటేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పీళమేడు పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ దొంగతనంలో శ్మశానవాటిక కేర్‌టేకర్ కార్తికేయన్ పాత్రపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.


