Covid: 5 వేలు దాటిన కోవిడ్‌ కేసులు | Covid Cases In India: June 6th 2025 Cases, Deaths Details | Sakshi
Sakshi News home page

Covid: 5 వేలు దాటిన కోవిడ్‌ కేసులు

Jun 6 2025 10:58 AM | Updated on Jun 6 2025 11:29 AM

Covid Cases In India: June 6th 2025 Cases, Deaths Details

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా కోవిడ్‌-19 యాక్టివ్‌ కేసుల సంఖ్య 5 వేలు దాటింది.  గత 24 గంటల్లో నాలుగు కోవిడ్‌ మరణాలు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాలతో ప్రకటించింది.

నిన్న కోవిడ్‌ కేసుల సంఖ్య 4,866 ఉండగా.. గత 24 గంటల్లో 500 కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,364కి చేరింది. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దేశం మొత్తం మీది కేరళలోనే ఏకంగా 1, 679 కేసులు నమోదు కావడం గమనార్హం. గత 24 గంటల్లోనే అక్కడ 192 కొత్త కేసులు బయటపడ్డాయి.

తాజాగా నాలుగు కోవిడ్‌ మరణాలు సంభవించగా.. గత 24 గంటల్లో కేరళలో ఇద్దరు మరణించారు. పంజాబ్‌, కర్ణాటకలో ఒకరి చొప్పున కోవిడ్‌తో మరణించారు. అయితే.. వైరస్‌ ప్రభావం మునుపటి స్థాయి తీవ్రతతో లేదని.. జలుబు, జ్వరం, నొప్పులతో మూడు, నాలుగు రోజుల్లో పేషెంట్లు కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఫంక్షన్‌లలో తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు. ఇక కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో కరోనా ప్రత్యేక వార్డుల్లో పడకల సంఖ్య పెంచుతున్నారు. 

జులై 2024 నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సుమారు 73 దేశాల్లో 11 శాతం కేసుల పెరుగుదల కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అయితే కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ ఎన్బీ.1.8.1 వేరియెంట్‌ వైరస్‌ వ్యాప్తికి కారణమని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement