135వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: దేశ భద్రత, స్వావలంబన దిశగా భారత్ సరికొత్త మైలురాళ్లను చేరుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సముద్రాల నుంచి గగనతలం దాకా మన దేశం మరింత సురక్షితంగా, స్వయం సమృద్ధిగా మారుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ 135వ ఎపిసోడ్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. రక్షణ రంగంలో విజయాలు, కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలు, పర్యావరణ పరిరక్షణ, మూఢనమ్మకాల నిర్మూలన తదితర అంశాలను ప్రస్తావించారు. ప్రధానమంత్రి ఏం చెప్పారంటే..
రక్షణ, విమానయాన రంగాల్లో స్వదేశీ ముద్ర
‘‘కోల్‌కతాలో జరిగిన నావికాదళ కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ దుణగిరి, ఐఎన్‌ఎస్ సంశోధక్, ఐఎన్‌ఎస్ అగ్రయ్ యుద్ధనౌకలు భారత నౌకాదళంలో చేరాయి. వీటి డిజైన్ నుంచి తయారీ వరకు అంతా స్వదేశీ పరిజ్ఞానమే. విమానయాన రంగంలోనూ భారత్ మరో ఘనత సాధించింది. మొట్టమొదటి ‘మేడ్ ఇన్ ఇండియా’సి–295 సైనిక రవాణా విమానం తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాలు మన దేశంలోనే తయారవుతున్నాయి’’ అని అన్నారు.
సామాన్యులకు బీమా భద్రత
‘‘బీమా పథకాలు సామాన్యుల జీవితాలకు భద్రత కల్పిస్తున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బహదూర్‌పురాకు చెందిన పెత్కర్ కుటుంబం వివాహ వేడుక సందర్భంగా 3,500 మంది గ్రామస్థులకు రూ.లక్ష చొప్పున ప్రమాద బీమా సదుపాయం కల్పించడం హర్షణీయం. అందుకు వారిని అభినందిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం సైతం కోట్లాది మందికి బీమా రక్షణ కల్పిస్తోంది. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద కేవలం రూ.20 వార్షిక ప్రీమియంతో రూ.2 లక్షల ప్రమాద బీమా లభిస్తోంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఏడాదికి రూ.436 ప్రీమియంతో రూ.2 లక్షల జీవిత బీమా అందుతోంది’’ అని అన్నారు.
మూఢ నమ్మకాలపై అస్సాం మహిళల పోరు
‘‘మూఢ నమ్మకాలను సైన్స్, తర్కంతో పారదోలవచ్చని అస్సాం మహిళలు నిరూపించారు. పరిసరాలను శుభ్రపర్చి పర్యావరణానికి మేలు చేసే హర్గిలా అనే అరుదైన పక్షిని అపశకునంగా భావించి చెట్లను నరికివేస్తూ వాటిని తరిమేసేవారు. అయితే, జీవ శాస్త్రవేత్త పూర్ణిమా దేవి బర్మన్ చొరవతో అస్సాం మహిళలు ‘హర్గిలా ఆర్మీ’గా ఏర్పడి ఆ పక్షులను సంరక్షిస్తున్నారు. హర్గిలా పక్షులు అపశకునం కాదని రుజువు చేస్తున్నారు. ఆ పక్షులు నేడు అస్సాం గ్రామాలకు గొప్ప గుర్తింపుగా మారాయి ’’ అని అన్నారు.
మేఘాలయా వేర్ల వంతెనలు..
‘‘మేఘాలయాలో దశాబ్దాల పాటు రబ్బరు చెట్ల వేర్లను పరస్పరం అనుసంధానించి సహజసిద్ధంగా నిర్మించిన వేర్ల వంతెనలు నిజంగా అద్భుతం. ఈ వంతెనల సంరక్షణకు 50 ఏళ్లుగా కృషి చేస్తున్న హాలీవార్‌కు ఈ ఏడాది పద్మ పురస్కారం లభించింది. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియోరాలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ‘ఎకో–బ్రిక్స్’గా మార్చి బహిరంగ ప్రదేశాలను సుందరంగా తీర్చిదిద్దడానికి స్థానిక మహిళలు కృషి చేస్తుండడం ఎంతైనా ప్రశంసనీయం’’ అని అన్నారు.
వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని చాటిచెప్పాలి
‘‘గణేశ్ చతుర్థి ఉత్సవాలకు సంబంధించిన అంశంపై మాట్లాడాలని కోరుతూ చాలామంది నాకు లేఖలు రాశారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను పూజించడం మానుకోవాలి. పర్యావరణాన్ని కాపాడేందుకు దేశీయ మట్టితో చేసిన విగ్రహాలనే పూజించాలి. వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని చాటిచెప్పాలి’’అని మోదీ పిలుపునిచ్చారు.
నా వినతిని ప్రజలు అర్థం చేసుకున్నారు
నా విజ్ఞప్తిని మన్నించినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పశ్చిమాసియా పరిస్థితుల దృష్ట్యా కొంతకాలం పాటు బంగారం కొనుగోలు చేయొద్దని, విదేశీ విహార యాత్రలు వాయిదా వేసుకోవాలని, చమురును ఆదా చేయడానికి కార్‌పూలింగ్ పద్ధతిని పాటించాలని కోరాను. ప్రజలు నా వినతిని అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది.


