ఇంటింటా ‘మా ఇంటి బంగారం’.. సీఎం విజయ్‌ భరోసా | CM Vijays Mega Gift Of 1 Gram Gold Ring For Every Newborn In Tamil Nadu, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఇంటింటా ‘మా ఇంటి బంగారం’.. సీఎం విజయ్‌ భరోసా

Jun 25 2026 8:00 AM | Updated on Jun 25 2026 11:52 AM

CM Vijays Mega Gift 1 Gram Gold Ring for Every Newborn in Tamil Nadu

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సరికొత్త సంచలన పథకానికి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందే ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే ప్రతి పసిబిడ్డకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘తాయ్‌మామన్ తంగ మోతీర తిట్టం’ (మేనమామ బంగారు ఉంగర పథకం) పేరుతో ప్రవేశపెట్టిన ఈ విశిష్ట కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తమిళ సంస్కృతిలో మేనమామ స్థానానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తోంది.

మేనమామగా సీఎం విజయ్
మాజీ ముఖ్యమంత్రి సి. ఎన్. అన్నాదురై జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది సెప్టెంబర్ 15న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. అయితే సీఎం విజయ్ పుట్టినరోజైన జూన్ 22 నుంచి ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ ఒక గ్రాము బంగారు ఉంగరం ధర రూ. 13,600 గా ఉంది. ఈ భారీ సంక్షేమ పథకం కోసం తమిళనాడు ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ. 755.83 కోట్లను కేటాయించడం గమనార్హం.
 

ఎవరెవరు అర్హులు? నిబంధనలు ఇవే
ఈ పథకం కింద లబ్ధి పొందడానికి ప్రభుత్వం కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించింది. తమిళనాడులోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, సర్కారు ఆస్పత్రులలో జన్మించే ప్రతి శిశువుకూ ఈ బంగారు ఉంగరం లభిస్తుంది. దీనికి ఎలాంటి లింగ బేధం లేదు. ఆడపిల్ల అయినా, మగపిల్లాడైనా ఈ కానుక అందుకోవచ్చు. అలాగే, ఎన్నోవ కాన్పు అనే నిబంధన కూడా లేదు. లబ్ధిదారులు తమిళనాడు నివాసితులై ఉండాలి. దరఖాస్తు సమయంలో రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ, నేటివిటీ సర్టిఫికేట్ లేదా ఇతర నివాస ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతమే లక్ష్యం
తమిళ సమాజంలో పురిటి బిడ్డకు బంగారం ఇవ్వడం అనేది ఒక శుభసూచకంగా, ఆశీర్వాదంగా భావిస్తారు. ఈ సాంప్రదాయాన్ని గౌరవిస్తూనే, మాతృత్వాన్ని కొనియాడటం, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచడం ఈ పథకంలోని ముఖ్య ఉద్దేశ్యం. ప్రస్తుతం తమిళనాడులో ఏటా దాదాపు 7.8 లక్షల ప్రసవాలు జరుగుతుండగా, అందులో 53 శాతం (సుమారు 4.2 లక్షల డెలివరీలు) ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. ఈ పథకం ద్వారా సురక్షిత ప్రసవాల సంఖ్యను మరింత పెంచవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఉంగరాల పంపిణీ బాధ్యతలను తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ పర్యవేక్షించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement