3,334 కిలోమీటర్ల మహా యాత్ర!
రెక్కల నిండా స్వేచ్ఛను నింపుకొంది. దిక్చక్రాల సరిహద్దులు దాటింది. ఆకాశాన్నే సామ్రాజ్యంగా మార్చుకుందా రాజ విహంగం. పంజరాల గోడల మధ్య పుట్టి పెరిగినా, ప్రకృతి పిలుపు అందుకోగానే అడవి బాట పట్టింది. మహారాష్ట్ర కొండల్లో రెక్కలు విప్పిన ఓ రాబందు.. మధ్యప్రదేశ్ వనసీమలను దాటుకుంటూ, ఏకంగా మూడు వేల కిలోమీటర్ల అవతల ఉన్న రాజస్థాన్ రాజకోటను ముద్దాడింది. అంతరించిపోతున్న తన జాతి మనుగడకు సరికొత్త ఆశల రెక్కలు తొడుగుతూ.. వన్యప్రాణి సంరక్షణ చరిత్రలోనే ఒక అద్భుతమైన ‘మహా యాత్ర’ను లిఖించింది..
మూడు రాష్ట్రాల మీదుగా..
వన్యప్రాణి సంరక్షణలో ఒక సరికొత్త రికార్డు నమోదైంది. మహారాష్ట్రలోని మేల్‌ఘాట్ అడవుల్లో శాస్త్రవేత్తలు స్వేచ్ఛగా విడిచిపెట్టిన ‘ఎక్స్–67’ (ఎక్స్67) అనే ఐదేళ్ల ఆడ రాబందు.. కేవలం 27 రోజుల్లో మూడు రాష్ట్రాల మీదుగా ఏకంగా 3,334 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, రాజస్థాన్‌లోని ప్రసిద్ధ రణథంబోర్ టైగర్ రిజర్వ్‌కు చేరుకుంది. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ డైరెక్టర్ కిశోర్ రీథే బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. మానవ సంరక్షణలో పెరిగి, అడవిలోకి వెళ్లిన పక్షులు.. మనుషుల సాయం లేకుండా స్వయంగా ఆహారాన్ని వెతుక్కోగలవని, ప్రకృతి శైలికి అద్భుతంగా అలవాటుపడగలవని ఈ ఘనత నిరూపించింది. భారతదేశంలో వేగంగా అంతరించిపోతున్న రాబందుల జనాభాను తిరిగి పెంచేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఇది పెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు.
అడవుల నెట్‌వర్క్‌లోనే బస
ఈ ఏడాది జనవరి 2న మేల్‌ఘాట్ నుంచి సోలార్ ట్రాకింగ్ ట్యాగ్‌లు అమర్చి వదిలిన 15 రాబందులలో ఈ ‘ఎక్స్–67’ ఒకటి. మొదట నాలుగు నెలల పాటు స్థానిక అడవుల్లోనే తిరుగుతూ ప్రకృతికి అలవాటుపడిన ఈ పక్షి.. మే 28న తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది. మహారాష్ట్ర నుంచి బయలుదేరి మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వ్, భోపాల్ ప్రాంతం, చిరుతలను పునరుద్ధరించిన కునో నేషనల్ పార్క్‌లలో తాత్కాలికంగా బస చేస్తూ.. మంగళవారం నాటికి రాజస్థాన్ రణథంబోర్ చేరుకుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


