సిబ్బందికి రీల్స్‌ పిచ్చి.. అదను చూసి సెంట్రల్ జైలు నుంచి ఖైదీ జంప్‌! | Bareilly Central Jail Staff Suspended After Life Convict Dinesh Escaped From Prison While Watching Reels On Mobile Phones | Sakshi
Sakshi News home page

సిబ్బందికి రీల్స్‌ పిచ్చి.. అదను చూసి సెంట్రల్ జైలు నుంచి ఖైదీ జంప్‌!

Jun 26 2026 11:31 AM | Updated on Jun 26 2026 12:11 PM

Bareilly Central Jail staff suspended after life convict Dinesh escaped from prison

మీరట్‌: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బరేలీ సెంట్రల్ జైల్లో జరిగిన నిర్లక్ష్యంలో జైలు ఉన్నతాధికారులు చిక్కుల్లో పడ్డారు. జైల్లో విధులు నిర్వహిస్తున్న గార్డులు తమ విధులు విస్మరించి మొబైల్‌లో రీల్స్ చూస్తుండగా.. జీవిత ఖైదు అనుభవిస్తున్న దినేష్ అనే ఖైదీ జైలు గోడ దూకి పారిపోయాడు. ఈ ఘటనలో  జైలర్ సహా 11 మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఉన్నతాధికారులు విచారణ ఎదుర్కొంటున్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ సెంట్రల్ జైలు దేశంలో అత్యంత కట్టుదిట్టమైన జైళ్లలో ఒకటి. ఇక్కడ అనేక మంది హై-ప్రొఫైల్ ఖైదీలు ఉన్నారు. ఇదే జైలులో అమ్రోహా జిల్లా నన్హెడా రాజ్‌పుత్ గ్రామానికి చెందిన దినేష్ (22) బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో  సోమవారం మధ్యాహ్నం అతనిని మరో 45 మంది ఖైదీలతో కలిసి జైలులోపల వ్యవసాయ పనులకు పంపారు.

ఘటన జరిగిన మధ్యహ్నం సుమారు 12.30 గంటల సమయంలో 10 మంది జైలు సిబ్బంది పర్యవేక్షణలో ఉండగా నిందితుడు  ఐదు అడుగుల ఎత్తైన గోడను ఎక్కి దినేష్ పారిపోయాడు. పారిపోయే సమయంలో జైలు సిబ్బంది మొబైల్ ఫోన్లలో రీల్స్ చూస్తున్నారని విచారణలో బయటపడింది.

ఈ ఘటనపై డీజీ (ప్రిజన్స్) పీసీ మీనా తక్షణ చర్యలు తీసుకున్నారు. జైలర్ నీరజ్ కుమార్, డిప్యూటీ జైలర్ వందనా చౌధరిలను సస్పెండ్ చేశారు. అదనంగా, సీనియర్ జైలు సూపరింటెండెంట్ అవినాష్ గౌతంపై కఠినమైన శాఖా చర్యలు సిఫారసు చేశారు. మరో ఏడు మంది కింది స్థాయి సిబ్బందిపై  చర్యలకు ఉపక్రమించారు.  

బరేలీ సెంట్రల్ జైల్లో సీసీటీవీ కెమెరాలు, పోలీసు పోస్టు, అదనపు భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, వరుసగా ఖైదీలు తప్పించుకోవడం జైలు నిర్వహణపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఖైదీలను బయట పనులకు పంపినప్పుడు పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని అధికారులు అంగీకరించారు.

దినేష్‌ను పట్టుకోవడానికి అమ్రోహా మరియు పరిసర ప్రాంతాల్లో శోధన బృందాలు ఏర్పాటు చేశారు. పోలీసులు, జైలు అధికారులు కలిసి అతని కోసం గాలిస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

కాగా, జైల్లో ఖైదును అనుభవిస్తున్న ఖైదీలో తప్పించుకోవడం ఇదే తొలిసారి కాదు. 2024 అక్టోబర్‌లో హర్పాల్ అనే హత్యా ఖైదీ కూడా ఇక్కడి నుండి పారిపోయాడు. ఆ సమయంలో కూడా సిబ్బందిని సస్పెండ్ చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తరువాత అతన్ని పోలీసు ఎన్‌కౌంటర్‌లో తిరిగి పట్టుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement